137 రోజుల తరువాత.. వంశీ విడుదల

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎట్టకేలకు బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. వంశీపై నమోదు అయిన అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో దాదాపుగా 4 నెలల 20 రోజుల పాటు సుదీర్ఘ జైలు జీవితం అనంతరం వంశీ బెయిల్ పై విడుదలయ్యారు. బుధవారం 2.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ అప్పటికే అక్కడకు చేరుకున్న తన సతీమణితో కలిసి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయారు.

దళిత యువకుడు సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ వంశీని అదుపులోకి తీసుకుని బెజవాడ తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనను బెజవాడ జైలుకు తరలించగా… ఆ తర్వాత వంశీపై అంతకుముందే నమోదు అయిన చాలా కేసులన్నీ ఓపెన్ అయిపోయాయి. కొత్తగా కొన్ని కేసులూ నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఓ కేసులో బెయిల్ వస్తే.. మరో కేసులో రిమాండ్ విధింపులతో నాలుగు నెలలకు పైబడి వంశీ జైలులోనే గడపాల్సి వచ్చింది.

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంశీ… ఆ తర్వాత టీడీపీని వీడి అధికార వైసీపీ దరి చేరారు. ఆపై జగన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గన్నవరంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వంశీ… కొడాలి నానితో కలిసి చంద్రబాబు, లోకేశ్ లపై పరుష పదజాలంతో విరుకుచుపడ్డారు. అంతేకాకుండా గన్నవరం టీడీపీ కార్యాలయంపై కూడా వంశీ తన అనుచరులతో దాడి చేయించారని ఆరోఫణలు ఉన్నాయి. ఈ కేసును మాఫీ చేసుకునే క్రమంలోనే ఆయన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేయించి అడ్డంగా బుక్కైపోయారు.