ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి అంతకు ముందు ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసిన పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభావం, వైసీపీ వ్యతిరేకత కారణంగా దివ్య భారీ విజయం నమోదు చేశారు. అయితే ఆమె సంగతి ఎలా ఉన్నా యనమల రామకృష్ణుడు పరిస్థితి మాత్రం డోలాయమానంలో పడింది.
ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత ఆయనను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మహానాడు నిర్వహించిన సమయంలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయనకు కొంత ప్రాధాన్యం లభించిన ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన సూచనలను మహానాడులో పాటించలేదన్నది పార్టీ వర్గాల్లో అప్పట్లోనే చర్చ నడిచింది. కానీ వాస్తవానికి యనమల రామకృష్ణుడు తనకు గుర్తింపును కోరుకుంటున్నారు. మహానాడుకు ముందు కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన ఆశయాన్ని చెప్పుకొచ్చారు.
తన జీవితంలో మిగిలిపోయిన ఒకే ఒక కోరిక రాజ్యసభకు వెళ్లడమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కూడా కొన్నాళ్లుగా పార్టీలోను రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. ఆయనను రాజ్యసభకు పంపిస్తున్నారని లేదా గవర్నర్గా పంపిస్తున్నారని కూడా నాయకులు చర్చిస్తూ వచ్చారు. కానీ ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు లేవు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో యనమల రామకృష్ణుడు బలమైన గళం వినిపిస్తున్నారు. తరచుగా ఆయన మీడియా ముందుకు వస్తున్నారు.
సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ప్రతి విషయంలోనూ గతంలో లేని విధంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పైన అదే విధంగా జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గుంటూరులో చోటుచేసుకున్న సింగయ్య మృతి ఘటనపై కూడా యనమల రామకృష్ణుడు స్పందించారు. జగన్ పై కేసు పెట్టడమే కాదు అరెస్టు చేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులపై కూడా ఆయన స్పందిస్తూ గతం కంటే ఇప్పుడు మెరుగైన రాబడి ఉందని అన్నారు.
ఆర్థిక శాఖ మంత్రిగా అనుభవం ఉన్న యనమల చేసిన వ్యాఖ్యలు కీలకమైనవనే చెప్పాలి. అయితే ఆయన ఏం మాట్లాడినా పెద్దగా ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదనేది రామకృష్ణుడు అనుచరులు చెబుతున్న మాట. వాస్తవానికి మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఆయన ఏం మాట్లాడినా మీడియాలో ప్రధానంగా చర్చకు రావాలి. పైగా సీనియర్ నాయకుడు కావడం, చంద్రబాబుతో కలిసి పదవులు పంచుకోవడం వంటివి కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్పినా పత్రికలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చూపించాలి. అయితే అనుకూల మీడియాలోనే ఆయన గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. దీంతోనే ఆయన అనుచరులు ఇప్పుడు ‘మా సార్ ని పట్టించుకోండబ్బా’ అనే మాట అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఆయనను పట్టించుకుంటారా లేక పక్కన పెట్టేశారా అనేది కాలమే నిర్ణయించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates