ప్రత్యర్థుల పొగడ్తలు భలే కిక్కిస్తాయబ్బా!

నిజమే… ప్రత్యర్థుల నుంచి మనపై పొగడ్తలు వెల్లువెత్తితే…అంతకుమించిన సంతోషం మరొకటి ఉందడు. ఇక రాజకీయాల్లో అయితే ఆ పొగడ్తలు అందుకున్న నేత నిజంగానే ఆకాశంలో విహరించినట్టే ఉంటుంది పరిస్థితి. గురువారం తెలంగాణ రాజకీయాల్లో ఇదే జరిగింది. బీజేపీ సీనియర్ నేత, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి… నేరుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన ముందే…బహిరంగ వేదికపై ఆకాశానికెత్తేశారు. కొండా పొగడ్తలను అలా వింటూ సాగిన రేవంత్ చివరకు నమస్కారంతో తన ప్రతిచర్యను ముగించారు.

అయినా ఏం జరిగింది? ఎందుకు రేవంత్ ను కొండా అంతగా పొగిడేశారు అన్న విషయానికి వస్తే… గురువారం మాదక ద్రవ్యాల నిరోధక దినోత్పవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు కాగా…ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ హోదాలో కొండా కూడా హాజరయ్యారు. ఇక కాంగ్రెస్, బీజేపీలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా చాలా మందే ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ కంటే ముందే ప్రసంగించిన కొండా… రేవంత్ లక్షణాలు, అలవాట్ల గురించి ప్రస్తావిస్తూ ఆయనను ఆకాశానికి ఎత్తారు.

ఈ సందర్భంగా రేవంత్ ఇప్పటిదాకా సిగరెట్టే తాగలేదని కొండా అన్నారు. అంతేనా… రేవంత్ ఇప్పటిదాకా బీరు రుచే చూడలేదని, విస్రీ, బ్రాందీల గురించే ఆయనకు తెలియదని అన్నారు. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే… రేవంత్ వాటి దరిదాపులకు కూడా వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఎలాంటి చెడు అలవాటు లేని కూల్ సీఎం మన రేవంత్ రెడ్డి అని ఆయన కీర్తించారు. ఫుట్ బాల్ ఆడుతూ రేవంత్ చిల్ అవడం తనకు ఎంతగానో నచ్చుతుందని కొండా అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభకు హాజరైన వారంతా కేరింతలతో రేవంత్ కు అబివాదం తెలిపారు.