12 వేల ఓట్లు.. ఆ యువనేతను సీఎం కాకుండా చేశాయ్

ఎన్నికల్లో అంకెలు చేసే మేజిక్ అంతా ఇంతా కాదు. గెలుపు.. ఓటముల మధ్య రేఖ ఎంత పలుచగా ఉందో కొన్ని సందర్భాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతాయి. తాజాగా బిహార్ ఎన్నికల ఫలితాల్ని చూస్తే మరింత బాగా అర్థం కావటం ఖాయం. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కాస్తంత మెజార్టీ అంటేనే పదివేల ఓట్ల అధిక్యత ఉంటుంది. అలాంటి పన్నెండు వేల ఓట్లు.. ఒక యువనేతను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డాయంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే.. అన్ని మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ ఫలితాల్ని చూస్తే.. మహాకూటమి గెలుపు ఖాయమని తేల్చేశారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఇదే జోష్ నడిచింది. ఓట్ల లెక్కింపు మాత్రం ఇందుకు భిన్నంగా సాగటమే కాదు.. అధికారం చివరకు ఎన్డీయే వైపు వెళ్లటం తెలిసిందే. పోటాపోటీగా సీట్లు సాధించినప్పటికీ.. చివర్లో మొగ్గు ఎన్డీయే వైపు సాగింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2015లో ఎన్నికల్లో మహాకూటమి.. ఎన్డీయే కంటే 7.8 శాతం ఓట్లను సాధించగా.. ఈసారి ఎన్డీయే 0.3 శాతం ఓట్లను మాత్రమే ఎక్కువగా పొందాయి. ఎన్డీయేకు 1.57 కోట్ల ఓట్లు వస్తే.. మహా కూటమికి 1.56 కోట్ల ఓట్లు వచ్చాయి. రెండు కూటమిలకు మధ్య వ్యత్యాసం కేవలం 12,768 ఓట్లు మాత్రమే. కేవలం 0.3 శాతం ఓట్లు తగ్గటంతో తేజస్వీకి సీఎం అయ్యే అవకాశం మిస్ అయితే.. ఎన్డీయే ఆ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇంత స్వల్ప వ్యత్యాసంతో ముఖ్యమంత్రి పీఠం చేజారటం విపరీతమైన వేదనకు గురి చేస్తుందనటంలో సందేహం లేదు.