రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు. స్థానిక సంస్థలను కూటమి నాయకులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్గత విభేదాలు కావచ్చు, వైసీపీ ఓడిపోయిన నేపద్యంలో ఆ పార్టీకి చెందిన నాయకులు దూరంగా జరగడం కావచ్చు, ఏదేమైనా పలు స్థానిక సంస్థల్లో కూటమి పార్టీలు జెండా ఎగరేసాయి. కీలకమైన గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్లను కూడా టిడిపి, జనసేనలు దక్కించుకున్నాయి.
అయితే ఈ పరంపరలో మరో కీలకమైన కార్పొరేషన్ వ్యవహారం మాత్రం కూటమికి కొరుకుడు పడటం లేదు. దీంతో ఏం చేయాలనే విషయంపై అంతర్గతంగా నాయకులు చర్చించుకుంటున్నారు. ఆ కార్పొరేషనే బెజవాడ!. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకోవడంలోనూ. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలోనూ మంచి పేరుంది. ఇతర కార్పొరేషన్ల కంటే ఒకప్పుడు ముందు ఉండేది.
కానీ ఇప్పుడు విశాఖ కార్పరేషన్ ముందుంది. ఇది పక్కన పెడితే… వైసిపి గత ఎన్నికల్లో బలమైన విజయం దక్కించుకుంది. అయితే, మేయర్ పోస్టు జనరల్ సీటు అయినప్పటికీ ఈ పదవిని నగరాలు సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మి కి అప్పగించారు. దీంతో మేయర్ సీటు దక్కుతుందని భావించిన ఓసీ సామాజిక వర్గాలు మౌనంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ల పై కన్నేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో విజయవాడను కూడా తమ సొంతం చేసుకున్నందుకు నాయకులు ప్రయత్నం అయితే చేశారు. కానీ బలమైన వైసీపీ నాయకులు ఉండడం టిడిపికి అంత పెద్ద బలం లేకపోవడంతో వెనక్కి తగ్గారు. కానీ మళ్ళీ మరోసారి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకుని మౌనంగా ఉన్న లేక అసహనంతో ఉన్న నాయకులను టిడిపి నేతలు టార్గెట్ చేసుకొని రాజకీయ దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో “మీరు బయటకు వచ్చి టిడిపికి మద్దతు పలికితే మేయర్ పదవిని ఇస్తామంటూ” ఓ సామాజిక వర్గానికి ఆఫర్ ఇచ్చినట్టు విజయవాడలో చర్చ జరుగుతుంది.
అయితే ఆ సామాజిక వర్గానికి వైసీపీతో ఉన్న అనుబంధం ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు. టిడిపి బలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం కూడా విజయవాడ కార్పొరేషన్ లో వైసీపీ ని పక్కన పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఏదేమైనా దీనిని సీరియస్ గా తీసుకున్న నాయకులు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates