రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పవనే ఆయువుపట్టుగా మారుతున్నారా? 2024 ఎన్నికలకు ముందు కూటమి కట్టించడంలో నూ.. గెలుపు గుర్రం ఎక్కించడంలోనూ కీలక రోల్ పోషించిన పవన్.. ఇప్పుడు కూడా అదే పాత్ర పోషిస్తున్నారన్న చర్చ రాజకీ య వర్గాల్లో సాగుతోంది. కూటమి సర్కారు విషయంలో పవన్ చాలా కీలకంగా మారుతున్నారని పరిశీలకులు అంటున్నారు. మళ్లీ ఎన్నికల సమయానికి కూటమి పదిలంగా ఉండేందుకు.. కట్టుబాటుతో ముందుకు కదిలేందుకు కూడా పవన్ రాజకీయ ఎత్తులు పనిచేస్తాయని చెబుతున్నారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉదహరిస్తున్నారు.
1) యువతను కదిలించే బలమైన గళం: పవన్‌కు సహజసిద్ధంగా అబ్బిన బలమైన గళం ఆయనకే కాకుండా.. కూటమికి కూడా బాగా కలిసి వస్తోంది. విషయంఏదైనా ఆయన గళం విప్పితే ప్రతిపక్షాలకు సౌండ్ లేకుండా పోతోందన్న వాదన ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది. ఏడాది పూర్తయిన పాలనపై సమీక్ష చేస్తూ.. ప్రతిపక్షాల తీరును ఆయన ఎండగట్టిన విధానం యువతను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు.. యువతను ఆకర్షించే చరిష్మా.. జగన్‌లో లేకపోవడంతో ఇది కూటమికి పవన్ ద్వారా మరింత కలిసి వస్తోందని అంటున్నారు.
2) కాపు సామాజిక వర్గం: పవన్‌పై కాపు సామాజిక వర్గంలో ఉన్న బలమైన ఆకాంక్ష పదిలంగా ఉంది. దీంతో గత ఎన్నికలకు ముందు ఎలా అయితే.. పవన్ కోసం పనిచేశారో.. ఇప్పుడు కూడా అదే తీరును ప్రదర్శిస్తున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలు కూడా పవన్ తోనే తీరుతాయన్న బలమైన ఆశ వారికి ఉంది. దీనికి తోడు.. తమ తరఫున బలమైన నాయకుడు ఒకే ఒక్క పవన్ అనే ధోరణి కూడా కనిపిస్తోంది. గతంలో రంగాపై ఆశలు పెట్టుకున్నవారు .. ఇప్పుడు పవన్ పై దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో ఇంత బలమైన కాపు నాయకుడు వారికి కనిపించకపోవడం కూడా.. ఓ బలమైన సంకేతంగా మారింది. ఇది కూడా.. కూటమికి కలిసి వస్తున్న పరిణామం.
3) మేలైన అభివృద్ధి: పవన్ అంటే.. కేవలం రాజకీయాలకు, సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా.. మేలైన అభివృద్ధికి ఆయన చిరునామాగా మారారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా.. బలమైన ముద్ర వేసుకున్నారు. ఇక, గ్రామీణ ప్రాంతాల్లోనూ రహదారులు నిర్మించడం ద్వారా పవన్ తొలి ప్రయత్నంలోనే గ్రామీణుల మనసు దోచుకుంటున్నారు. ఇవన్నీ.. పవన్ టు కూటమి అన్నట్టుగా మారుతోంది. దీంతో పవన్ కల్యాణ్ కూటమికి ఆయుపట్టనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. టీడీపీకి బలం లేదని కాదు.. బీజేపీ బలహీన పడిందని కాదు.. ఒక బలమైన ఆకర్షణా శక్తి ఉన్న నాయకుడిగా పవన్.. కూటమికి మేలు చేస్తున్నారన్నదే పరిశీలకులు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates