ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా ఛానెళ్లలో కూడా ప్రచారం జరిగింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనా దేవిని చూసేందుకు పవన్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారని ప్రచారం జరిగింది.
ఇక, తన తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి షూటింగ్ ఆపేసి అపోలో ఆస్పత్రికి వచ్చారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. దీంతో, మెగా అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అయితే, ఆ వార్తలు అవాస్తవమని పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని నాగబాబు స్పష్టం చేశారు. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారని తెలిపారు.
దీంతో, ఆ పుకార్లకు చెక్ పడ్డట్లయింది. గతంలో కూడా పవన్ కల్యాణ్ అనారోగ్య కారణాల వల్ల రెండు సార్లు కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే పవన్ హైదరాబాద్ వెళ్లారన్న వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా నాగబాబు తాజా ప్రకటనతో మెగా అభిమానులు, జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates