తన సోదరుడు, ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సందర్భానుసారంగా పదునైన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సింగయ్య మృతిపై స్పందించిన షర్మిల..జగన్ ను ఏకిపారేశారు.
జగన్ ప్రతీ విషయంలోనూ ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి రాలేదని, ఇప్పుడు జన సమీకరణతో బలప్రదర్శన చేస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్‌కు నిబంధనలు, ఆంక్షలు వర్తించవని, మూడు బండ్లకు అనుమతిస్తే ముప్పై బండ్లతో వెళతారని.. మోదీ దత్తపుత్రుడు కాబట్టి జగన్ అలా చేస్తున్నారా అని షర్మిల ప్రశ్నించారు. కార్ల కింద మనుషులని నలుపుకుంటూ పోతూ, మానవత్వం గురించి జగన్ మాట్లాడుతారా? అని నిలదీశారు. వాహనంసైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయడం జగన్ చేసిన తప్పని, జనాలకు జగన్ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో సింగయ్య ఆ వాహనం కింద పడి నలిగిపోయాడని అన్నారు. అయితే, జరిగిన తప్పు ఒప్పుకోకుండా ఫేక్ వీడియో అని వైసీపీ నేతలు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.
మద్యపాన నిషేధం చేస్తామని ఎందుకు లిక్కర్ కుంభకోణానికి పాల్పడ్డారని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లి సమాధానం చెప్పే దమ్ము లేదని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రుషికొండకు ఎందుకు గుండు గొరిగారో చెప్పాలని నిలదీశారు. తనకు, జగన్‌కు ఉన్న విభేదాలు, రాష్ట్ర సమస్యలతో పోల్చితే చాలా చిన్నవని చెప్పారు. జగన్ సీఎం అయిన వెంటనే తమ మధ్య విభేదాలు వచ్చాయని అన్నారు.
వైఎస్సార్ కొడుకయినప్పటికీ మోదీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీకి జగన్ మద్దతిచ్చారని ఆరోపించారు. అదానీ, అంబానీలతో పాటు ఎవరికి ఏ మేలు కావాలన్నా చేశారని గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ తన మెడ వంచారని చురకలంటించారు. ఏపీకి ఏ మేలూ చేయని పార్టీ బీజేపీ అని, పదిహేనేళ్లుగా ఏపీ ప్రజలను బీజేపీ వెన్నుపోటు పొడుస్తూనే ఉందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates