ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు బాబు గుడ్ న్యూస్‌!

ఏపీలో ఆగ‌స్టు 15వ తేదీ నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ‘సూప‌ర్ 6’ హామీల్లో ఇది కీల‌కం. అయితే.. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో దీనిపై అనేక అధ్య‌య‌నాలు కూడా పూర్త‌య్యాయి. దీనికి దాదాపు ఒక ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నారు. జిల్లాలు, మండ‌లాల వారీగా మ‌హిళ‌ల‌కు పాసులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. దీని ప్ర‌కారం.. బ‌స్సుల్లో వారు ఉచితంగా ప్ర‌యాణం చేయొచ్చు. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభం చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని తాజాగా ‘సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు’ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. మ‌హిళ‌ల‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటామ‌ని చెప్పారు. తెలుగు దేశం పార్టీ మ‌హిళా ప‌క్ష‌పాతి అని.. గ‌తంలోనూ మ‌హిళ‌ల‌కు ఆస్తిలో హ‌క్కు క‌ల్పించామ‌ని.. ఇటీవ‌లే త‌ల్లికి వంద‌నం కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేశామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 15 నుంచి ఆర్టీసీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని కూడా అమ‌లు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సూప‌ర్‌6ను అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. అయితే.. ఆర్టీసీలో ఉచిత‌ ప్ర‌యాణంతో ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్లు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంద‌ని త‌న‌కు నివేదిక‌లు అందాయ‌ని సీఎం చెప్పారు.

దీనిపై కూడా క‌స‌రత్తు చేసిన సీఎం తెలిపారు. ర‌వాణా రంగంపై ఆధార‌ప‌డి ల‌క్ష‌ల మంది కార్మికులు జీవిస్తున్నార‌ని.. ప్రైవేటు ర‌వాణా రంగంతో ప్ర‌భుత్వానికి కూడా ఆదాయం వ‌స్తోంద‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలో వారు న‌ష్ట పోకుండా.. ఆగ‌స్టు 15నే వారిని ఆదుకునేందుకు సంక్షేమ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టిస్తామ‌న్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణాల కార‌ణంగా న‌ష్ట‌పోయే ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు సొమ్ములు మంజూరు చేస్తామ‌ని తెలిపారు. అయితే.. దీనిపై విధివిధానాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి వివ‌రించారు. కాగా.. ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా.. త‌మ‌కు కిరాయిలు త‌గ్గుతాయ‌ని.. న‌ష్ట‌పోతామ‌ని.. ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్లు.. రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తున్న నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.