జ‌గ‌న్ కు ఆ అనుమతులు ఇవ్వొద్దు: ష‌ర్మిల డిమాండ్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు.. అస‌లు ప్ర‌జ‌ల స‌మీక‌ర‌ణ‌ల‌కు జ‌గ‌న్‌కు అనుమ‌తి ఇస్తే.. తామే కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో జ‌రిగిన దారుణంపై జ‌గ‌న్‌లో ఎలాంటి ప‌శ్చాత్తాపం క‌నిపించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారు ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగేందుకు అనుమ‌తి ఇస్తే.. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతుంద‌ని విమ‌ర్శించారు. రెంట‌పాళ్ల గ్రామంలో వైసీపీ కార్య‌క‌ర్త ఒక‌రు.. కాన్వాయ్ కింద ప‌డి మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లో జ‌గ‌న్‌పై కేసు పెట్ట‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని ఆమె చెప్పారు.

అయితే.. ఆధారాల‌ను ప‌క్కాగా సేక‌రించి కేసులో శిక్ష ప‌డేలా చేయాల‌ని.. ఈ విష‌యంలో ఏమాత్రం తేడాగా వ్య‌వ‌హ‌రించినా.. జ‌గ‌న్ త‌ప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని ష‌ర్మిల చెప్పారు. జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే సింగ‌య్య అనే కార్య‌క‌ర్త మృతి చెందాడ‌ని ఆమె చెప్పారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్నారు. క‌నీసం ఐదు రోజుల త‌ర్వాతైనా.. ప్ర‌భుత్వం త‌న త‌ప్పును స‌రిదిద్దుకుంద‌న్నారు. చేసిన త‌ప్పుడు ప‌నికి.. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ పై ఉంద‌న్నారు. అయితే.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోగా.. ఇది న‌కిలీ వీడియో ఏఐ ద్వారా రూపొందించార‌ని చెప్ప‌డం.. దారుణ‌మ‌ని విమ‌ర్శించారు.

సోమ‌వారం తిరుప‌తిలో ప‌ర్య‌టించిన ష‌ర్మిల‌.. మీడియాతో మాట్లాడారు. “జ‌గ‌న్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా సింగ‌మ‌య్య కుటుంబానికి 5 కోట్లో,  10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని వేడుకోవాలి. ప్ర‌జ‌ల ముందు కూడా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.“ అని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల‌పాటు స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసిన పెద్ద‌మ‌నిషి.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను ఓదార్చేందుకు బ‌య‌లు దేరార‌ని ఎద్దేవా చేశారు.

‘‘జగన్‌వి బలప్రదర్శనలు, జన సమీకరణ కార్యక్రమాలు“ అని వ్యాఖ్యానించారు. అందుకే ఈ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని కూట‌మి ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా కోరుతున్నామ‌న్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఉన్న వారంద‌రినీ విచారించా ల్సిందేన‌న్నారు.  “జగన్‌కి మానవత్వం అనే పదానికి అర్థం తెలియదు. మానవత్వం ఉంటే సింగయ్యను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు.“ అని ప్ర‌శ్నించారు. భ‌విష్య‌త్తులో జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాకుండా నిలువ‌రించేలా తాము న్యాయ పోరాటం చేస్తామ‌న్నారు. ఇంట్లో కూర్చొని కూడా ప్ర‌జ‌ల‌తో మాట్లాడ‌వ‌చ్చ‌ని.. జ‌గ‌న్ ఇక‌, ఇంటికే ప‌రిమితం కావ‌డం మంచిద‌ని వ్యాఖ్యానించారు.