టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తొలిసారి.. తన పెదనాన్నతో కలిసి వేదికను పంచుకున్నారు. మాజీమంత్రి, పరుచూరు మాజా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. నారా లోకేష్‌కు సొంత పెదనాన్న అన్న విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.. లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరికి సోదరి. అంటే ఆమె లోకేష్‌కు పెద్దమ్మ. ఆమె భర్తే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈయన కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరికీ పరిచయమే.
అయితే.. ఇన్నేళ్లలో ఎప్పుడూ.. నారా లోకేష్-దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేదిక పంచుకున్న పరిస్థితి కనిపించలేదు. కాగా.. ప్రస్తుతం ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఆయనను దగ్గుబాటి కుటుంబం ఓ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లుకు వెళ్లిన నారా లోకేష్.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తన తండ్రి చెంచురామయ్య జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించిన సైనిక్ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అంటే.. పెదనాన్న నిర్మించిన స్కూలుకు లోకేష్ రిబ్బన్ కటింగ్ చేశారు.
రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఈ ఏడాది ప్రారంభంలో తను రాసిన పుస్తకాన్ని సీఎం, తనకు స్వయానా తోడల్లుడు అయ్యే చంద్రబాబుతో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు, తనకు కూడా కుమారుడి వరసయ్యే నారా లోకేష్‌తో స్కూల్‌ను ప్రారం భింపజేశారు. స్కూలు ప్రారంభం అనంతరం.. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చెంచురామయ్య విగ్రహా న్ని కూడా.. నారా లోకేష్ ఆవిష్కరించారు.
ఈ పరిణామంతో ఇరు కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు దాదాపు తొలిగిపోయాయన్న వాదన పార్టీలో వినిపిస్తోంది కొన్నాళ్ల పాటు కాదు.. కొన్నేళ్ల పాటు నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలు నడిచిన విషయం తెలిసిందే. అయితే.. పురందేశ్వరి బీజేపీలో ఉండగా.. వెంకటేశ్వరరావు గతంలో వైసీపీలో ఉన్నారు. తర్వాత.. బయటకు వచ్చారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates