యొగా చేయకుంటే వైజాగ్ రావద్దన్నారు బాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖ వేదికగా జరిగిన యోగా డేలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 3 లక్షల మందికి పైగా జనంతో యోగాసనాలు వేయించిన ఏపీ సర్కారు అత్యధిక జనంతో యోగాసనాలు వేయించిన విషయంలో గిన్నిస్ రికార్డు సాదించింది. ఇక యోగా అంటే అప్పటిదాకా ఎంతమాత్రం అలవాటు గానీ, ప్రాక్టీస్ గానీ లేని భారీకాయులు కూడా ఉత్సాహంగా తమ మేనిని వంచి మరీ యోగాసనాలు వేశారు. వీరిలో ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు.

యోగా డేలో తన అనుభవాలను అచ్చెన్ననే స్వయంగా మీడియాతో పంచుకున్నారు. వాస్తవానికి అచ్చెన్నది భారీకాయం. ఇప్పుడనే కాదు… ఆది నుంచి కూడా ఆయన భారీకాయుడే. యోగా, కరాటే, ఇతరత్రా ఆటల పోటీలకు ఆయన దాదాపుగా దూరమనే చెప్పాలి. అలాంటి అచ్చెన్న విశాఖ యోగా డేలో ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఇన్ స్ట్రక్టర్లు ఎలా చెబితే అలా పిన్ పాయింట్ కూడా పొరపాటు లేకుండా ఆయన యోగాసనాలు వేశారు. అంతటి భారీకాయంతో పకడ్బందీగా యోగాసనాలు వేసిన అచ్చెన్నను నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే.

అయినా అంతటి భారీకాయంతో అచ్చెన్న యోగాసనాలు ఎలా వేయగలిగారు? అంటే… దానికి సమాధానం కూడా అచ్చెన్ననే చెప్పారు. యోగా డేకు ఓ మూడు రోజుల ముందుగా జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం చంద్రబాబు… అచ్చెన్నను, ఆయన భారీకాయాన్ని చూసి ఓ మాట అన్నారట. అచ్చెన్నాయుడు గారు… మీరు సరిగ్గా యోగాసనాలు వేస్తే సరి.. లేదంటే విశాఖ యోగా డేకు రావద్దని చెప్పారట. ఈ మాట అచ్చెన్నకు ఎక్కడో తగిలిందట. అంతే… ఎలాగైనా ఇతరుల్లాగే పకడ్బందీగా యోగాసనాలు వేయాల్సిందేనని నిశ్చయించుకున్నారట.

బాబు మాటలతో తనలో ఓ థృడమైన విశ్వాసం కలిగిందని అచ్చెన్న చెప్పుకొచ్చారు. భారీకాయం ఉంటే మాత్రం తానెందుకు యోగా చేయలేనని ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చానని ఆయన అన్నారు. అంతే… ఎలాగైనా యోగాను చేయాల్సిందేనని నిర్ణయించుకున్న అచ్చెన్న…యోగా డే నాడు అందరి మాదిరిగానే పకడ్బందీగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత యోగాసనాల గురించి తీసుకుంటే… ఫస్ట్ ప్రైజ్ తనకే రావాలని అచ్చెన్న అన్నారు. ఇతరుల మాదిరే సింగిల్ పిన్ పాయింట్ కూడా తప్పకుండా యోగాసనాలు చేసిన తాను ఫస్ట్ ప్రైజ్ కు అర్హుడినేనని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతైనా బాబు ఒక్క మాటతో అచ్చెన్న ఓ రేంజిలో యోగాసనాలు వేయడం నిజంగా అద్భుతమేనని చెప్పక తప్పదు.