ఏపీ రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుండుగుత్తగా అమరావతినే కోరుకుంటున్నారు. ఈ విషయం తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టంగా తెలిసింది. ప్రస్తుతం రాజధాని అమరావతి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. మూడు రాజధానులు అంటూ.. జగన్ గత తన పాలనలో ఎలుగెత్తారు. కానీ, ప్రజలు మాత్రం నూటికి నూరు శాతం అమరావతి వైపే మొగ్గు చూపారు. చంద్రబాబు మాత్రమే అమరావతి కట్టగలరని వంద శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. తాజా సర్వేలో తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
మొత్తం 78 శాతం మంది ప్రజలు.. సీఎం చంద్రబాబు అమరావతిని కట్టి తీరుతారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. చంద్రబాబు నిరంతరం ఈ పనులపైనే ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే అమరావతి పూర్తి అవుతుందన్నారు. ఈ విడత పాలనలోనే అమరావతి పూర్తవుతుందన్న విశ్వాసం తమకు ఉందని 78 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక 22 శాతం మంది మాత్రం అమరావతికి జై కొడుతూనే.. ఇది త్వరగా పూర్తికావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అంటే.. ఎవరూ కూడా రాజధానిని వ్యతిరేకించలేదు. అదేసమయంలో మూడు రాజధానుల పాట పాడిన జగన్‌కు జై కొట్టలేదు. సో.. అమరావతిపై పూర్తి క్లారిటీ ప్రజల్లో ఉందని తాజా నివేదిక స్పష్టం చేసింది.
పంటికింద రాళ్లు!
కూటమి ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది తాజాగా వెలుగు చూసిన సర్వే స్పష్టం చేసింది. మూడు పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాయి. అయితే.. ఆయా పార్టీల ఎమ్మెల్యేల్లో 64 శాతం మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వేలో తేలింది. ఇది చాలా ప్రమాకర సంకేతాలను ఇస్తోంది. 2019 ఎన్నికలకుముందు కూడా టీడీపీ ఎమ్మెల్యేలపై ఇలానే సర్వేలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. దీంతో అధికారం పోయింది. ఇప్పుడు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి.. ఆయన ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలను లైన్‌లో పెట్టుకునేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది.
ఇక 28 శాతం మంది ఎమ్మెల్యే పనితీరు బాగుందని ప్రజలు చెప్పారు. అయితే.. వీరిలోనూ సగంమందిపై స్వల్ప అసంతృప్తి కనిపించింది. ప్రజలకు చేరువగా ఉంటూనే.. మరోవైపు.. పనులు చేయడం లేదని వీరిపైనా విమర్శలు ఉన్నాయి. మరో 11 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై.. ప్రజలు ఇంకా ఒక అభిప్రాయానికి రాకపోవడం గమనార్హం. అంతేకాదు.. కొందరు ప్రజలకు.. తమ ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని చెప్పడం గమనార్హం. ఎలా చూసుకున్నా.. ఎమ్మెల్యేల పనితీరు విషయంలో మాత్రం సర్కారు ఇప్పటి నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సర్వే చాటి చెబుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates