బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదని.. ఆయనో పేపర్ పులి మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లాలూచీ పడినట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చుని ప్రజంటేషన్లు ఇస్తే.. ప్రయోజనం లేదని, ఢిల్లీలో కూర్చుని ప్రయత్నాలు చేయాలని.. లేకపోతే ఉద్యమాలైనా చేయాలని సూచించారు.
బనకచర్ల ద్వారా.. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి ఫణంగా పెడుతున్నారని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ వృథాగా పోతున్న నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించారని.. కానీ.. దీని ప్రకారం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదన్నారు. అందుకే.. పోలవరం నుంచి బనకచర్ల వరకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని చెప్పారు. తాజాగా కవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి నడిపించడం లేదని.. ఆయన ఏం చేయాలన్నా.. ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారని.. ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నీస్ రికార్డు ఇవ్వాలని అన్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూర్చోబోమని కవిత చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబుతో లాలూచీ పడుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ టైగర్ అని రేవంత్ రెడ్డి తనకు తానే చెప్పుకొంటున్నారని.. కానీ, ఆయన పేపర్ పులి మాత్రమేనని చెప్పారు. సీఎం చంద్రబాబు అంటే భయపడుతున్నారేమో తెలియడం లేదన్నారు. అందుకే అక్కడ ప్రాజెక్టులు కడుతున్నా.. ఇక్కడ కనీసం నోరు పెగలడం లేదని వ్యాఖ్యానించారు.
బనకచర్లను అడ్డుకుని తీరుతామని కవిత చెప్పారు. తాను బీఆర్ ఎస్‌లోనే ఉన్నానని.. తెలంగాణ జాగృతి సంస్థ.. బీఆర్ ఎస్‌కు అనుబంధమని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. తాను ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ ఎస్ కార్యకర్తలు వస్తున్నారని చెప్పారు. కేటీఆర్, కేసీఆర్‌పై విచారణలు కేవలం టైం పాస్ చర్యలేనని కవిత వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates