గత ఏడాది ఎన్నికల్లో టీడీపీలో కీలకమైన నాయకుడిని ఓడించిన వైసీపీ యువ నేత, ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. దూకుడు చూపించలేక పోవడంతో.. సదరు నియోజకవర్గంలో టీడీపీ నేత హవా.. యథాతథంగా కొనసాగుతుండడం గమనార్హం. ముఖ్యంగా రైతులు, కార్మికులు ఆయన చుట్టూనే తిరుగుతున్నారు. దీంతో సదరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. విషయంలోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ నుంచి టీడీపీ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ చౌదరి వరుస విజయాలు సాధించారు. నిత్యం మీడియాలో ఉండే ఆయన వివాదాలకు కేరాఫ్‌గా మారిన విషయం తెలిసిందే.
2014, 2009 ఎన్నికల్లో విజయం సాధించిన చింతమనేని.. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. దీనికి ఆయన వివాదాస్పద వైఖరే కారణమనే విశ్లేషణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున కొఠారు అబ్బయ్య చౌదరి ఇక్కడ విజయం సాధించారు. యువ నాయకుడు, విదేశాల్లో విద్య చదువుకుని ఉండడం, దూరదృష్టి గత నాయకుడిగా పేరు తెచ్చుకోవడం, నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయడం, రైతులకు అన్ని విధాలా మేలు చేస్తానని హామీ ఇవ్వడం వంటి పరిణామాలతో ఆయనపై ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకుని గత ఎన్నికల్లో ప్రభాకర్‌ను పక్కన పెట్టారు. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అయిపోయింది.
అయితే, ఇప్పటి వరకు అబ్బయ్య చౌదరి.. నియోజకవర్గంలో వీసమెత్తు అభివృద్ధి పనులు కూడా చేయలేదనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ప్రధానంగా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఇక్కడి పొలాలకు నీటిని తరలించేందుకు గతంలో చింతమనేని తవ్వించిన కన్నసముద్రం చెరువు మధ్యలోనే ఆగిపోయింది. దీనిని పూర్తి చేయించడం ద్వారా స్థానిక రైతులకు నీరు అందించే అవకాశం ఉంది. కానీ, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాత్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఇక, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకు డబుల్ రోడ్డు వేయడంతోపాటు ప్రధాన రహదారుల విస్తరణ విషయంలోనూ ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక, స్థానిక సమస్యల పరిష్కారం విషయంలోనూ అబ్బయ్య పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ వారు కాని వారనే గీత గీసుకుని.. వ్యవహరిస్తున్నారని రైతులు మధన పడుతున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ ఎమ్మెల్యే కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారనేది ప్రధాన విమర్శ. దీంతో చింతమనేని అయితే బాగుండేదని, కనీసం ఆయన చేపట్టిన పనులైనా పూర్తయ్యేవని ఇక్కడ రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేకు మార్కులు తగ్గడంతోపాటు.. చింతమనేని మౌనంగా ఉన్నప్పటికీ.. సింపతీ పెరుగుతుండడం గమనార్హం. ఇదే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా గెలిచినా.. ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates