బాబు-జ‌గ‌న్‌ల‌కు బీహార్ ఫ‌లితం నేర్పుతున్న పాఠం!!

మితిమీరిన ఉత్సాహం.. ప‌క్క‌పార్టీల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం.. యువ నేత‌ల‌ను తీసిపారేయ‌డం.. వీటిని ప్ర‌జ‌లు స‌హించ‌లేక పోయిన వైనం.. బిహార్ ఎన్నిక‌లు స్ప‌ష్టం చేసేశాయి. నేను త‌ప్ప మీకు మ‌రో మంచి ముఖ్య‌మంత్రి ఉన్నారా? అన్న నితీశ్‌కు ప్ర‌జ‌లు స‌మాధానం చెప్ప‌క‌నే చెప్పారు. ఆయ‌న ఎక్క‌డ నుంచైనా పోటీ చేసి ఉంటే.. అది మ‌రింత గ‌ట్టిగా ఆయ‌న‌కు వినిపించేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, ఆయ‌న గ‌త ముప్పైఏళ్లుగా విధాన ప‌రిష‌త్‌(మ‌న‌ద‌గ్గ‌ర శాస‌న మండ‌లి)కే ప‌రిమితమై.. అటు నుంచే సీఎంగా చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో నేరుగా ఆయ‌న‌కు ప్ర‌జాగ్ర‌హం తాక‌క‌పోయినా.. ఆయ‌న పార్టీ నేత‌ల‌పై మాత్రం ప్ర‌జ‌లు స్ప‌ష్టంగా తీర్పు చెప్పారు.

అదేస‌మ‌యంలో ఏమీలేద‌ని.. అస‌లు జెండా మోసేవారే లేర‌ని.. యూపీ నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను తెచ్చుకుని ఇక్క‌డ ప్ర‌చారం చేస్తున్నార‌ని కాంగ్రెస్‌, ఆర్జేడీ వంటి పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పించిన బీజేపీ అనూహ్యంగా పుంజుకోవ‌డం బిహార్ నేర్పుతున్న మ‌రోపాఠం. ఇక‌, ఎక్క‌డ ఒద‌గాలో.. ఎక్క‌డ ఎద‌గాలో తెలియ‌కుండా.. స‌ర్వం త‌న‌దేన‌ని.. త‌న తండ్రి సింప‌తీ కార్డు ప‌నిచేస్తుంద‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికి.. బీజేపీ వ్యూహంలో చిక్కి.. త‌న‌కు తాను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకున్న ఎల్‌జేపీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ‌వాన్ ఓ అనూహ్య‌మైన ఎదురుదెబ్బ‌ను చ‌విచూశారు. అదేస‌మ‌యంలో పొత్తుల‌తోనే అధికారం సిద్ధిస్తుంద‌నే వాచాల‌త్వంతో ముందుకు ఉరికి.. కాంగ్రెస్ బ‌లాన్ని అంచ‌నా వేసుకోలేక పోయినా.. ఆర్జేడీ చీఫ్‌ తేజ‌స్వి కూడా సీఎం పీఠం అంచుల‌వ‌ర‌కు వ‌చ్చి.. వెన‌క్కి మ‌ళ్లారు.

ఇవ‌న్నీ కేవ‌లం బిహార్‌కే ప‌రిమితం కాలేదు. ఏపీ వంటి సంక్లిష్ట రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్న రాష్ట్రంలోనూ పాఠాలుగా ప‌నికివ‌స్తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ అంటే నేనే.. న‌న్ను చూసే ఓటేస్తారు. అని భావిస్తున్న జ‌గ‌న్ కు బీహార్ ఫ‌లితం ఓ గుణ‌పాఠం. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అంచ‌నా వేసుకోలేక పోతే.. నితీశ్ ఎదుర్కొన్న ప‌రిస్థితి ఆయ‌న‌కు కూడా త‌ప్ప‌దు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఎక్క‌డ ఒద‌గాలో నేర్పుతున్న పాఠం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మై.. ఆ వ‌ర్గం వారినే దువ్వ‌తున్న పార్టీగా ప్ర‌జ‌ల్లో పేరు తెచ్చుకోవ‌డం ఆ పార్టీకి శ‌రాఘాతంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితే.. బిహార్ ఎన్నిక‌ల్లో పాశ‌వాన్ పార్టీకి ఎదురైంది.

మ‌రో కీల‌క పార్టీ జ‌న‌సేన‌. ఇది ఆర్జేడీని త‌ల‌పిస్తోంది. త‌న బ‌లం తాను గుర్తించ‌లేక పోతోంది. పొత్తుల‌తోనే త‌మ‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని అనుకుంటోంది. కానీ, సొంత‌గా ఎదిగే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎక్క‌డా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఈ మూడు పార్టీలూ గ‌మ‌నించాల్సిన ప్ర‌ధాన అంశం… బీజేపీ! దీనికి ఓటు లేదు.. ప్ర‌జ‌ల్లో బ‌లం లేదు.. అనుకుంటున్న ధోర‌ణిని ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది బిహార్ ఫ‌లితం స్ప‌ష్టం చేస్తోంది. ఇలా ఎటు చూసినా.. ఎలా విశ్లేషించినా.. బిహార్ ఫ‌లితం.. ఏపీలోని అన్ని పార్టీల‌కూ పాఠం నేర్పుతోంద‌న‌డంలో సందేహం లేదు.