ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. గత నెలలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీని కుటుంబ సమేతంగా కలుసుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఇప్పుడు మరోసారి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. బుధ, గురువారాల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. దీంతో ఇప్పుడు ఆయన పర్యటనకు సంబంధించిన విశేషం ఏంటనేది ఆసక్తిగా మారింది.
తాజాగా ఈ నెల 21న ఏపీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆతిధ్యం ఇస్తోంది. దీనిని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మంగళవారం విశాఖలోనే ఉండి.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచ రికార్డు సృష్టించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం పెరిగింది.
ఇదిలావుంటే.. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని తాజాగా సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆహ్వాన పత్రికలను తీసుకుని ఢిల్లీ వెళ్లి.. పలువురు కేంద్ర మంత్రులను నారా లోకేష్ ఆహ్వానించనున్నట్టు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. రాష్ట్రంలో పొగాకు సహా.. ఇతర వ్యవసాయ పంటల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి కూడా.. కేంద్రంతో ఆయన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో అధికారులు కూడా నారా లోకేష్ వెంట ఉండనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates