ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాల పర్యటనల్లో బాబు ఈ హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తారు. అయితే ఈ హెలికాప్టర్ భద్రతపై మాత్రం అధికారులు అంతగా దృష్టి సారించడం లేదన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పుడప్పుడూ సాంకేతిక కారణాలు సహజమే గానీ.. మరీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం ఆదివారం నాటి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సందర్భంగా వెలుగు చూసింది.
ఏపీలో పొగాకు రైతుల సమస్య, ఇతర వాణిజ్య పంటల ఎగుమతులు, ఇతర పంటలకు మద్దతు ధరల విషయాల్లో పరిష్కార మార్గాలను చూపేందుకు గోయల్ ఆదివారం ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతిలో చంద్రబాబుతో లంచ్ మీటింగ్ లో పాలుపంచుకున్న గోయల్… ఆ తర్వాత బాబు జిల్లాల పర్యటనలకు వాడే హెలికాప్టర్ లోనే తిరుపతి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం అదే హెలికాప్టర్ లో గోయల్ కృష్ణపట్నం వెళదామని ముందే ప్లాన్ చేసుకున్నారు. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా కృష్ణపట్నం టూర్ ను రద్దు చేసుకున్న గోయల్… నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు.
బాబు జిల్లాల టూర్ లకు వినియోగించే ఈ హెలికాప్టర్ నే ఏపీకి వచ్చే వీవీఐపీల పర్యటనకూ దీనినే వినియోగిస్తున్నారు. అయితే చాలా కాలంగా ఈ హెలికాప్టర్ లో ఎప్పటికప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయిట. అయితే వీటిని అధికారులు అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఇలాంటి విషయాలపై బాబు పెద్దగా పట్టించుకోరు కాబట్టి…ఈ విషయాన్ని అధికారులూ సీరియస్ గా తీసుకోనట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి టూర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ విషయం నేరుగా డీజీపీ దృష్టికి చేరిపోయింది.
సాక్షాత్తు సీఎం చంద్రబాబు వినియోగించే హెలికాప్టర్ లో ఇలా సమస్యలు తలెత్తితే వాటి గురించి ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన అవసరం లేదా? అని డీజీపీ కిందిస్థాయి అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరగరానిది జరిగితే… ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ఆయన క్లాస్ పీకినట్టు సమాచారం. అంతటితో ఆగని డీజీపీ… సీఎం వినియోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక చూసిన తర్వాత ఈ హెలికాప్టర్ ను వాడాలా? పక్కనపెట్టేయాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates