ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి మరోసారి వస్తున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రావాలంటూ.. సీఎం చంద్రబాబు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నెల 20న రాత్రికి ఒడిశా నుంచి విశాఖకు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి.. తెల్లవారు జామున 5.30 గంటలకే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. దీనిని విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా రాజిల్లుతున్న ఆర్కేబీచ్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోడీతో పాటు.. దేశ విదేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రెండు రోజుల ముందే విశాఖకు వెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాల య వర్గాలు చెబుతున్నాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. 1) అంతర్జాతీయ యోగాకు గిన్నిస్ రికార్డును కల్పించడం. 2) ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడం. ప్రస్తుతం ఏపీ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే 5 లక్షల మందిని ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష భాగస్వాములను చేయనున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా.. యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దీంతో రికార్డును సృష్టించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్‌లను కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతున్నారు. 1 నాటికల్ మైలు వరకు.. వ్యర్థాలు లేకుండా.. తీర్చిదిద్దుతున్నారు. రకరకాల రంగుల్లో బెలూన్లను ఏర్పాటు చేయడంతోపాటు.. తీరం వెంబడి మత్స్యకారుల బోట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చూపరులకు కనువిందు చేసేలా ఈ ఏర్పాట్లు ఉన్నాయి. అలానే.. యోగా ముగిసిన వెంటనే.. అల్పాహారం, టీ, కాఫీలు అందించేందుకు వీలుగా బీచ్ వెంబడి లక్షకు పైగా మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
వీటన్నింటినీ చంద్రబాబు ఒకరోజు ముందే పరిశీలించనున్నారు. అలానే.. ప్రధాని పర్యటనకు సంబం ధించి ఎక్కడా చిన్నపాటి లోపం కూడా రాకుండా ఏర్పాట్లుచేస్తున్నారు. ఇవన్నీ కూడా.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. రెండు రోజుల ముందే విశాఖకు చేరుకుని.. అక్కడే మకాం వేసి.. ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates