రాజధాని అమరావతిపై అవాకులు-చెవాకులే కాదు.. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కేసులు నమోదు కావడం..వారిని పోలీసులు అరెస్టు చేయడం.. జైలుకు వెళ్లడం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదని.. కేవలం ‘యాంకర్’ పాత్ర పోషించారని.. పైగా.. నవ్వినంత మాత్రాన ఆయనను అరెస్టు చేయడం తగదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని కీలకమైన భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 19, 19/2లను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. భావప్రకటనను బందీ చేయడానికి వీల్లేదని.. అలా అయితే.. తాము కూడా తీర్పుల సమయంలోను, వాదనల సమయం లోనూ నవ్వుతామని.. వ్యాఖ్యానించింది. అనంతరం.. కొమ్మినేనికి బెయిల్ ఇచ్చింది. కట్ చేస్తే.. ఇదే కేసులో తాజాగా శుక్రవారం జైలుకు వెళ్లిన కృష్ణంరాజుకు మాత్రం అంత ఈజీగా బెయిల్ దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొమ్మినేని ఆశ్రయించినట్టే కృష్ణంరాజు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పలువురు న్యాయనిపుణులు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఆర్టికల్ 19, 19/1, 19/2 లు భావ ప్రకటనకు పెద్దపీట వేసినా.. ఇదే ఆర్టికల్‌లోని 19/4 కొంత నియంత్రణ విధించిందని చెబుతున్నారు. ఒక వర్గాన్ని.. సమాజాన్ని.. దూషించడం.. నేరాలను అంటగట్టడం.. భావ ప్రకటన కిందకు రాబోదని ఆర్టికల్ 19/4 చెబుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీకోర్టులో కృష్ణంరాజు పిటిషన్ వేసినా.. ఆయన చేసిన వ్యాఖ్యల తీవ్రత, ఒక సమూహాన్ని, ఒక కీలక రాజధాని ప్రాంతాన్ని అవమానించేలా.. తప్పుబట్టేలా ఉన్నాయని కాబట్టి ఆయనకు ఎలాంటి ఊరట లభించే అవకాశం లేదని అంటున్నారు.
మరోవైపు.. ఈ ఒక్క కారణమే కాకుండా.. కుట్ర(కాన్‌స్పైరసీ) సెక్షన్ కూడా కృష్ణంరాజుకు వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. అయి తే.. కొమ్మినేని విషయంలో ఈ సెక్సన్‌ను కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. యాంకర్‌కు కుట్ర ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించింది. కానీ, నేరుగా ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు విషయంలో ఈ సెక్షన్ బలంగా పనిచేస్తుందని అంటున్నారు. దీంతో కొమ్మినేనికి లభించినంత ఈజీగా.. కృష్ణంరాజుకు బెయిలు దక్కే అవకాశం లేదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates