తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై వరుసబెట్టి విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణలకు బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ లాంటి నేతలే హాజరు అవుతున్నారు. తాజాగా ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఓ దఫా ఏసీపీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోమారు నోలీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో సోమవారం విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఆ సంస్థ కేటీఆర్ ను కోరింది.
వాస్తవానికి ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇదివరకే ఓ దఫా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు ఈ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదంటూ ఊహాగానాలు వినిపించాయి. తాను అరెస్టు కావడం ఖాయమన్న దిశగా కేటీఆర్ ఓ అంచనాకు వచ్చారు. తనను అరెస్టు చేస్తున్నారు కదా… ఇంకెప్పుడు చేస్తారంటూ ఆయన నేరుగా తనను విచారిస్తున్న ఏసీబీ అదికారులనే ఆయన పదే పదే ప్రశ్నించిన వైనం కూడా నాడు కనిపించింది. అయితే నాడు కేటీఆర్ ను ఏసీబీ అరెస్టు చేయకపోగా… విచారణకు కేటీఆర్ ఓ మోస్తరుగా సహకరించారని చెప్పడం గమనార్హం.
తొలి విచారణ జరిగిన చాలా కాలం తర్వాత మరోమారు విచారణకు రావాలంటూ ఏసీబీ నుంచి కేటీఆర్ కు ఇప్పుడు నోటీసులు జారీ కావడంపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కారు రేసుల్లో మరింత పటిష్టమైన ఆధారాలను సేకరించిన నేపథ్యంలోనే ఏసీబీ కేటీఆర్ ను మరోమారు విచారణకు పిలుస్తోందా? అంటూ ఓ వర్గం భావిస్తోంది. మరికొందరేమో.. ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఆయనను తాజాగా విచారణకు పిలుస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇక మూడో వర్గమైతే.. బీఆర్ఎస్ నేతలు నిత్యం విచారణల భయంలోనే కొనసాగేలా కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని భావిస్తోంది.
గతంలో మాదిరిగా బీఆర్ఎస్ ఇప్పుడు ఏకతాటిపై లేదనే చెప్పాలి. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖ బయటకు వచ్చిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత… తన సోదరుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు నోటీసులు వస్తే బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది గానీ… కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు అంతగా పట్టించుకోలేదని కూడా ఆమె ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. మొత్తంగా పార్టీలో ఓ విభజన రేఖను ఆమె గీశారు. ఇప్పుడు కేటీఆర్ విచారణకు హాజరైతే… మునుపటి మాదిరిగా బీఆర్ఎస్ నుంచి మద్దతు లబిస్తుందా? అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates