ఈ ఏడాదే.. నారా లోకేష్ విశ్వ‌రూపం..!

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. గ‌త ఏడాదిలో త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించి.. మంచి మార్కులు వేసుకున్నారు. అటు పార్టీ ప‌రంగా.. ఇటు పాల‌న ప‌రంగా.. మ‌రోవైపు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రంగా కూడా.. నారా లోకేష్ గ‌త ఏడాది వ్య‌వ‌హ‌రించిన తీరు.. చూపిన చొర‌వ డిస్టింక్ష‌న్‌లో పాస్ చేసింది. ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత‌.. అని కొల‌త‌లు వేసుకుంటే.. నారా లోకేష్ గ్రాఫ్ తారా జువ్వ‌లా ఎగిసింద‌నే చెప్పాలి. ఎందుకంటే.. కేవ‌లం ఆయ‌న ఒక విష‌యానికి ప‌రిమితం కాలేదు.

అవ‌డానికి ఆయ‌న మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రే అయినా.. ఆయ‌న తీరు.. పాల‌న‌లో చూపిన చొర‌వ వంటి వి ప్ర‌ధాని మోడీ అంత‌టి దిగ్గజ నాయ‌కుడికే.. మెరిపించేలా చేశాయి. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తి లేక‌పోయినా.. త‌న‌ను ప్ర‌శ్నించేవారు లేక‌పోయినా.. త‌న‌ను తానే ప్ర‌శ్నించుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు. త‌ద్వారా.. మంగ‌ళగిరిలో అంద‌రి వాడుగా నారా లోకేష్ గుర్తింపు పొందారు. ప‌నులు.. సంక్షేమం.. వంటివి రెండు క‌ళ్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.

ఇక‌, విద్యా శాఖ మంత్రిగా.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు కూడా భేష్ అనే అనిపించాయి. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల బ‌దిలీల‌కు మోక్షం క‌ల్పించారు. ఒకానొక ద‌శ‌లో ఉపాధ్యాయులు నిర‌స‌న‌కు పిలుపునిస్తే.. చోద్యం చూడ‌లేదు.. వారిపై అక్క‌సు ప్ర‌ద‌ర్శించ‌లేదు. త‌న వారిని రంగంలోకి దింపి.. చ‌ర్చించి.. వారి అభిమ‌తానికి అనుగుణంగానే నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఒక మెట్టు దిగి.. ప‌ది మెట్లు ఎక్కారు. అదేస‌మ‌యంలో వైసీపీకి కౌంట‌ర్ ఇవ్వ‌డంలోనూ.. పదునుగా వ్య‌వ‌హ‌రించారు. పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చారు.

క‌ట్ చేస్తే.. ఏడాది పూర్త‌యింది. ఇప్పుడు రెండో సంవ‌త్స‌రం ప్రారంభ‌మైంది. ఈ ఏడాది అస‌లు విశ్వ‌రూపం చూపించేందుకు నారా లోకేష్ ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ఆయ‌న జిల్లాల బాట ప‌ట్ట‌నున్నారు. జూలై నుంచి ఎమ్మెల్యేల‌ను ఇంటింటికీ పంపించ‌నున్నారు. అదేవిధంగా మ‌హానాడులో ప్ర‌వ‌చించిన ‘ఆరు శాస‌నాల‌’ను కూడా ఈ ఏడాది ప‌క్కాగా అమ‌లు చేయ‌నున్నారు. త‌ద్వారా మొనాటినీ లేకుండా.. ప్ర‌జ‌ల నాయ‌కుడిగా నారా లోకేష్ గుర్తింపు సాధించ‌నున్నారు. సో.. ఈఏడాది నారా లోకేష్‌లో విశ్వ‌రూప‌మే కాదు.. విచ‌క్ష‌ణాయుత‌మైన నాయ‌కుడిని కూడా ప్ర‌జ‌లు చూడ‌నున్నారు.