ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పైకి చేరిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి మొదలు షర్మిల వరకు ఎంతోమంది విశ్వప్రయత్నాలు చేశారు. అయినా సరే, ప్రత్యేక తెలంగాణను ప్రకటించి ఆంధ్రాకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రజలు ఇంకా కోపంగానే ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య సఖ్యత లేకపోవడం వంటి పలు కారణాలతో పార్టీ పుంజుకోలేకపోతోంది.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ చెప్పి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. షర్మిల మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు గొడవపడ్డారు. కార్యకర్తలను సమన్వయకర్తలు పట్టించుకోవడంలేదని, ప్రజల్లో తిరగడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, గుంతకల్లు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చాలని కార్యకర్తలు పట్టుబట్టారు.

ఈ క్రమంలోనే అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో, పోలీసులు, బౌన్సర్లు రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ దశలో షర్మిల కూడా జోక్యం చేసుకొని కార్యకర్తలు ఇలాగే గొడవపడితే తాను సమావేశం నుంచి వెళ్లిపోతానని హెచ్చరించారు. షర్మిల సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఆ తర్వాత సమావేశం కొనసాగింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం రాబోతుందని, ఇటువంటి సమయంలో అంతర్గత కలహాలను పక్కనబెట్టాలని, విభధాలు వీడి కలిసి పని చేయాలని షర్మిల పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కూటమితో పాటు వైసీపీ కూడా ప్రజా పాలనలో విఫలమైంని, విభేదాలు వీడి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates