ఏపీలో టీడీపీ రథసారథిగా జనసేన, బీజేపీలతో కలిసి ఏర్పడ్డ కూటమి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసింది. 175 సీట్లలో 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి..బలీయమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి పాలనకు బుధవారంతో ఏడాది పూర్తి కాగా… గురువారం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది. వాస్తవంగా సంకీర్ణ ప్రభుత్వాలంటే.. అలకలు, రాజీలు, సర్దుబాట్లు… ఇలా చాలానే ఉంటాయి. అయితే కూటమి సర్కారులో మాత్రం ఈ తరహా పరిణామాలేమీ కనిపించలేదనే చెప్పక తప్పదు. ఉమ్మడిగా ఎన్నికలను గెలిచిన మూడు పార్టీలు ఉమ్మడిగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్నాయి.
ఎంత కలిసికట్టుగా సాగుతున్నా…రెండు రాజకీయ పార్టీలు మధ్య కొన్ని వైరుధ్యాలు ఉంటాయి. కొన్ని సానుకూలతలూ ఉంటాయి. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో సానుకూలతల కంటే కూడా వైరుధ్యాలే అధికంగా ఉంటాయి. ఫలితంగా నిత్యం లుకలుకలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఏపీ ప్రజల అదృష్ణమో, ఏమో తెలియదు గానీ కూటమి సంకీర్ణ సర్కారులో వైరుధ్యాల శాతం 1 అయితే సానుకూలతల శాతం ఏకంగా 99గా ఉంది. 99 శాతం ముందు 1 శాతం ఏమాత్రం కనబడదు కదా. అందుకే మూడు పార్టీలతో కూడిన కూటమి సర్కారులో అసలు లుకలుకలు అన్న మాటే కనిపించడం లేదు. వినిపించడమూ లేదు. వెరసి రానున్న నాలుగేళ్లు కూడా కూటమి సంకీర్ణ సర్కారు ఎలాంటి ఢోకా లేకుండానే సాగిపోతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
సానుకూలతల విషయానికి వస్తే… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య నెలకొన్న సోదర భావం కూటమిలోని సానుకూలతలు అన్నింటిలోకి హైలెట్ గా చెప్పుకకోవచ్చు. వాస్తవానికి చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు కూటమి ఆవిర్భావానికి అడుగు పడింది. లోకేశ్ పోరాట పటిమను చూసిన పవన్… బాబుకు అండగా నిలవాలంటే కలిసి సాగాల్సిందేనని తీర్మానించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసి పనిచేస్తాయని రాజమండ్రి జైలు వద్దే ప్రకటించేశారు. ఈ ప్రకటన లోకేశ్ మరింత మేర ధైర్యాన్ని నింపిందని చెప్పక తప్పదు. ఆపై వారిద్దరూ కలిసి బీజేపీతో మంతనాలు సాగించి దుర్మార్గ పాలనతో సాగుతున్న వైసీపీని గద్దె దించేందుకు వ్యూహాలు రచించారు. వాటిని పక్కాగా అమలు చేశారు. లోకేశ్, పవన్ ల మధ్య బంధం మూడు పార్టీల శ్రేణులను మరింత దగ్గరకు చేర్చాయని చెప్పక తప్పదు.
ఇక మూడు పార్టీల మధ్య పదవుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లు రాకుండా సీఎం చంద్రబాబు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ అవకాశం వచ్చినా.. రెండు మిత్రపక్షాలతో చర్చించి మరీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో జనసేన, బీజేపీలు సంతోషంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ, రాజ్యసభ, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు… ఇలా ఏ అవకాశం వచ్చినా కూడా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్న చంద్రబాబు ఆయా పార్టీలు సాధించిన సీట్ల దామాషా పద్ధతిన అవకాశాలు కల్పిస్తున్నారు. తాము అడిగిన మేరకు తమకు అవకాశాలు దక్కుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా ఎలాంటి అసంతృప్తి లేకుండానే సాగుతున్నాయి. అదే సమయంలో టీడీపీ అడిగిన మేరకు ఏ విషయంలో అయినా సహకారం అందించేందుకు కూడా ఆ రెండు పార్టీలు ఏమాత్రం వెనుకాడటం లేదు.
ఇక ప్రతికూలతల విషయానికి వస్తే… టీడీపీ, జనసేన ఎంతగా కలిసిపోయినా… లోకేశ్, పవన్ లు ఎంతమేర సోదర భావంతో మమేకం అయిపోతున్నా… ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య అప్పుడప్పుడు, అక్కడక్కడ కొంతమేర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాము గొప్ప అంటే…కాదు తామే గొప్ప అంటూ ఇరు పార్టీల శ్రేణులు వాదులాటలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మనస్పర్థలు తప్పడం లేదు. ఇక మరో ప్రతికూలత ఏమంటే… టీడీపీ, జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నంత మేర బీజేపీ శ్రేణులు ఆయా కార్యక్రమాల్లో ఉత్సాహం చూపడం లేదు. మూడు పార్టీలు కలిసి చేపట్టాల్సిన కొన్ని చర్యలపై బీజేపీ శ్రేణులు అసలు తమకు ఏమీ పట్టనట్టే సాగుతున్నాయి. బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఇదే బాటన సాగుతుండటం కొంత ఆందోళన కలిగించే అంశమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates