హోం శాఖ రేవంత్ ద‌గ్గ‌రే.. కొత్త మంత్రుల‌కు ఏమిచ్చారంటే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల కింద‌ట త‌న కేబినెట్‌ను విస్త‌రించిన విష‌యం తెలిసిందే. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు స‌హా.. అనేక మందిని సంప్ర‌దించి, అధిష్టానంతో చ‌ర్చించిన త‌ర్వాత‌.. ముగ్గురంటే ముగ్గురికి మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. వీరిలో నూ ఇద్ద‌రు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఉన్నారు. వాస్త‌వానికి ఐదు నుంచి ఆరుగురికి అవ‌కాశం ఉన్నా.. కేవ‌లం ముగ్గురికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, వీరికి తాజాగా శాఖ‌లు కేటాయించారు. పైకి దీనిపై అధిష్టానంతో చ‌ర్చించ‌లేద‌ని చెబుతున్నా.. తాజాగా వెల్ల‌డించిన శాఖ‌ల‌ను బ‌ట్టి.. అధిష్టానం సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇక‌, తాజాగా మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన వారిలో గ‌డ్డం వివేక్( చెన్నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం), వాకాటి శ్రీహ‌రి(మ‌క్త‌ల్ ఎమ్మెల్యే ), అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌(ధ‌ర్మ‌పురి ఎమ్మెల్యే)ల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వీరికి శాఖ‌లు కేటాయించారు. గడ్డం వివేక్ – కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు, వాకిటి శ్రీహరి – పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ – ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. కానీ.. అంద‌రూ ఆశించిన‌ట్టుగా.. కీల‌క‌మైన హోం శాఖ‌ను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎవ‌రికీ కేటాయించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం వ‌ద్దే.. సుమారు 7 శాఖ‌ల వ‌ర‌కు ఉన్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైంది హోం శాఖ‌. దీనిని అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఎస్సీ కోటాలో ఆశించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ శాఖ‌ను త‌న ద‌గ్గ‌రే పెట్టుకున్నారు. అయితే.. తాజాగా ఇచ్చిన కేటాయింపుల‌ను చూస్తే.. దీనిపై పార్టీ అధిష్టానం స్ప‌ష్ట‌మైన ముద్ర క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌డ్డం వివేక్‌కు కార్మిక, న్యాయ‌, క్రీడా శాఖ‌ల‌ను కేటాయించారు. వీటిలో కీల‌క‌మైంది కేవ‌లం కార్మిక శాఖ మాత్ర‌మే. ఇక‌, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖలు ఇచ్చారు. వీటిలోనూ క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ కీల‌కం.

అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. కానీ, ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిణామాలు.. శాంతి భ‌ద్ర‌త‌లు.. రాబోయే రాజ‌కీయ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. శాంతి భ‌ద్ర‌త‌లను సీఎం రేవంత్ ద‌గ్గ‌రే ఉంచిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి కీల‌క‌మైన శాఖ‌ను మాత్రం రేవంత్ త‌న‌ద‌గ్గ‌రే పెట్టుకున్నార‌న్న వాద‌న‌వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.