‘స‌ర్వే’ చేయించుకుంటున్నారు ..!

రాష్ట్రంలో స‌ర్వేల‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పార్టీ ఏదైనా.. నాయ‌కులు ఎవ‌రైనా.. స‌ర్వేల‌కు ఇస్తున్న ప్రా ధాన్యం అంతా ఇంతా కాదు. నిజానికి స‌ర్వేలంటే.. ఎన్నిక‌ల‌కు ముందు లేదా.. ఎన్నిక‌ల ఏడాదిలో జ‌రుగుతాయి. అప్పుడు ప్ర‌జ‌ల నాడిని తెలుసుకునేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ముంద‌స్తు స‌ర్వేలు చేయించుకుంటారు. ఇది కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న ప‌ద్ధ‌తి.

అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. నాయ‌కుల తీరుతో పాటు.. ప్ర‌జ‌ల నాడికూడా మారింది. న‌మ్ముకున్న వారే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి అంతా యూటర్న్ అయిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇదే క‌నిపించింది. తాము అమ‌లు చేసిన సంక్షేమం.. ప‌ధ‌కాలు వంటివి త‌మ‌కు గెలుపు గుర్రాన్ని అందిస్తాయ‌ని వైసీపీ నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ.. బ‌ల‌మైన స్థానాల్లోనూ వైసీపీ ప‌రాజ‌యం పాలైంది. ఇది చాలా సీరియ‌స్ అంశం.

ఈ నేప‌థ్యంలోనే నాయ‌కులు త‌మ త‌మ గ్రాఫ్‌ను ఎప్పటిక‌ప్పుడు ప‌రిశీలించుకుంటున్నారు. ఏడాది అయిన నేప‌థ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు త‌మ గ్రాఫ్‌పై దృష్టి పెట్టారు. ప్ర‌జ‌లు త‌మ‌పై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విష‌యాన్ని తెలుసుకుంటున్నారు. వాస్త‌వానికి ఒక‌ప్పుడు ఈ స‌మాచారం కోసం త‌మ అనుచ‌రుల‌ను వినియోగించుకునేవారు. కానీ.. వీరు స‌రిగ్గా స‌మాచారాన్ని అందించే విష‌యంలో వెనుక బ‌డుతున్నారు. పైగా మొహ‌మాటాలు కూడా అడ్డం వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ప్రైవేటు స‌ర్వే సంస్థల‌కు ప్రాధాన్యం పెరిగింది. ఎమ్మెల్యేలు ఎంత‌ఖ‌ర్చ‌యిన భ‌రించేందుకు రెడీ అవుతున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు త‌మ గురించి ఏమ‌నుకుంటున్నారు.. ఏం చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారు? అనే విష‌యాల‌పై స‌ర్వే చేయించుకుంటున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఎమ్మెల్యేల్లో మార్పులు రానంత వ‌ర‌కు.. ఈ స‌ర్వేలు ఎన్ని చేయించుకున్నా ప్ర‌యోజనం ఉంటుందా? అనేది ప్ర‌శ్న‌. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్న నాయ‌కుల్లో మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంది.