=

మూతి బిగింపులు-అల‌క‌లు: టీ-కాంగ్రెస్‌లో బుజ్జ‌గింపుల ప‌ర్వం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయ‌కులు అల‌క‌బూనారు. తాజాగా మంత్రి వ‌ర్గ కూర్పు పూర్త‌యిన విష‌యం తెలిసిందే. ఎంతో మంది ఆశ‌లు పెట్టుకున్నా.. చివ‌ర‌కు ప‌ద‌వులువారిని వ‌రించ‌లేదు. ఢిల్లీ టు ఢిల్లీ అన్న‌ట్టుగా నాయ‌కులు ప్ర‌ద‌క్షిణ‌లు చేసినా వారిని అదృష్టం వ‌రించ‌లేదు. దీంతో నాయ‌కులు మూతి బిగించారు. మ‌రికొంద‌రు అల‌క‌పాన్పులెక్కారు. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మానికి చాలా వ‌ర‌కు త‌క్కువ మందే హాజ‌ర‌య్యారు. ఆహ్వానాలు ఇచ్చినా.. రాని వారు కూడా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఇలా అల‌క‌బూనిన నాయ‌కుల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

ప్ర‌ధానంగా ఆది నుంచి కూడా కొంద‌రు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. “మంత్రిన‌వుతా.. మీ ప‌ని ప‌డ‌తా!” అంటూ.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షానికి స‌వాళ్లు రువ్విన నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. ఇలాంటివారికి సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో పార్టీ అవ‌కాశం క‌ల్పించ‌లేక పోయింది. అదేవిధంగా పూర్తిగా కూడా మంత్రి వ‌ర్గాన్ని ఫుల్ ఫిల్ చేయ‌లేక పోయింది. ఈ నేప‌థ్యంలో అలాంటి వారిని కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు బుజ్జ‌గించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఎందుకు ప‌ద‌వులు ఇవ్వ‌లేక పోయారో వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న‌ సుదర్శన్‌రెడ్డి, పార్టీ కీల‌క నాయ‌కుడు ప్రేమ్‌సాగర్‌రావు, సీనియ‌ర్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను కాంగ్రెస్‌ నాయకత్వం బుజ్జగిస్తోంది. పేరు పేరునా వారికి ఫోన్లు చేసి.. పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితులను వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. అంతేకాదు.. వారి ఆవేద‌న‌ను గుర్తించిన పార్టీ నాయ‌క‌త్వం.. నేరుగా వారికి ఇళ్ల‌కు వెళ్లి.. వారిని స‌ర్దుబాటు చేసే ప్ర‌క్రియ కూడా చేప‌ట్టింది. ఇది పార్టీలో తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలోనూ అనేక మందికి ప‌ద‌వులు రాక‌పోయినా.. వారిని కేవ‌లం ఫోన్లు చేసి బుజ్జ‌గించేవారు. కానీ, ఈ ద‌ఫా మాత్రం ప్రేమ్‌సాగ‌ర్‌రావు ఇంటికి, అదేవిధంగా సుద‌ర్శ‌న్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జ‌గించ‌డం గ‌మ‌నార్హం. ఇది పెద్ద దుమారానికి దారితీయ‌కుండా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ప‌ద‌వులు ఆశించిన వారు పెద్ద నేత‌లు కావ‌డం.. ప్ర‌జా బ‌లం ఉన్న నాయ‌కులు కావ‌డంతో ఈ బుజ్జ‌గింపులు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. ఒక‌వేళ వారు నోరు విప్పి విమ‌ర్శ‌లు గుప్పించేఅవ‌కాశం ఉంద‌ని భావిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా జోక్యం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.