తెలంగాణ బీజేపీకి-ఏపీలోని కర్నూలు జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న ‘బనకచర్ల’ ప్రాజెక్టుకు మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీలో కూటమి సర్కారు ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ-టీడీపీ-జనసేన కలసి కట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో తెలంగాణ బీజేపీ నాయకులు ఉన్నారు. అంతేకాదు.. ఇటీవల ఈటల రాజేందర్ కూడా.. ఏపీలో ప్రభుత్వం బాగుందని కితాబు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఏపీలో చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణలో బీజేపీకి సెగ పెంచుతోంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుతులు లేకుండానే.. బనకచర్ల ప్రాజెక్టును కడుతున్నా.. బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పడంలేదని.. తాజాగా మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. అంతేకాదు.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా బనకచర్లకు నిధులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి చాపకింద నీరు మాదిరిగా ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోందన్నారు.
అయినా.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ వ్యవహారం ఏపీకి మేలు చేసేలా ఉందన్నారు. ఇక, శ్రీశైలం విషయంపైనా హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. శ్రీశైలం కుడివైపు ఏపీప్రభుత్వం లైనింగ్ పనులు చేస్తోందన్నారు. దీనివల్ల తెలంగాణ వాటర్..ఏపీకి పోతుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు నీటి సమస్య తలెత్తుతుందని చెప్పారు. బనకచర్ల పూర్తయితే.. గోదావరి జలాలపై పూర్తి హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు.
అయితే.. వాస్తవానికి బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా.. కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక, బీజేపీ నాయకులు మాత్రమే మౌనంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ప్రయోజనాలను గమనిస్తున్న కమలనాథులు.. ఏపీలో అధికారం పంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే.. నీటి విషయంలో బీజేపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రెడీ కావడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.