ఇక టీడీపీలోకి ఎంట్రీ అంత వీజీ కాదు!

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన కీలక నేతలు చాలా మంది ఆ పార్టీని వీడారు. వారిలో మోపిదేవి వెంకటరమణ లాంటి వారు టీడీపీలో చేరితే… బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు జనసేనలో చేరారు. ఇక ఆర్ కృష్ణయ్య లాంటి వారు బీజేపీలో చేరారు. ఇలాంటి చేరికల్లో జనసేనలోకే అధికంగా జరిగాయి. టీడీపీలోకి మాత్రం వేళ్లమీద లెక్క పెట్టేంత మందికి మాత్రమే ఎంట్రీ లభించింది. బీజేపీలోకీ అంతే. ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా నేతల చేరికలపై శనివారం టీడీపీ అధిష్ఠానం ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం వైసీపీ నేతలైనా, మరే పార్టీకి చెందిన నేతలైనా ఇకపై టీడీపీలో చేరడం అంత వీజీ కాదని చెప్పక తప్పదు.

టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరిట విడుదలైన ఈ ప్రకటనలో ఇతర పార్టీలకు చెందిన నేతల చేరికలపై పార్టీలోని వివిధ స్థాయిల్లో ఉన్న నేతలందరికీ పార్టీ అధిష్ఠానం ఓ దిశానిర్దేశం చేసింది. ఇకపై పార్టీలోకి చేరేందుకు వచ్చే ఆయా నేతల చేరికపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఇష్ఠారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. పార్టీలోకి వచ్చే నేతల వివరాలను పార్టీ నేతలు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన ఇతర పార్టీల నేతల వివరాలను టీడీపీలోని వివిధ స్థాయిల్లోని నేతలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత నేతలను పార్టీలోకి చేర్చుకోవాలా? వద్దా? దానిపై కేంద్ర కార్యాలయం దిశానిర్దేశం మేరకు పార్టీ నేతలు అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది.

టీడీపీలో ఇప్పటిదాకా ఈ తరహా జాగ్రత్తలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఓ మోస్తరు స్థాయి ఉన్న నేతలు వస్తామంటే పార్టీ అధిష్ఠానం కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. పార్టీలోకి చేరుతున్న నేతల నియోజకవర్గాలకు చెందిన సొంత నేతలు అభ్యంతరం చెబితే తప్పించి ఆయా పార్టీల నేతల చేరికలకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదు. ఈ తరహా చేరికలతో టీడీపీనే నమ్ముకుని ఉన్న చాలా మంది నేతలు ఇబ్బంది పడ్డారు. కొందరైతే పొరుగు పార్టీల నేతల కారణంగా ఏకంగా పార్టీని కూడా వీడారు. అయితే ఇప్పుడు అలా కాదు 40 ఏళ్లకు పైగా ప్రస్థానం కలిగిన టీడీపీ ఇప్పుడు ఉచ్ఛ స్థితిలో ఉంది. ఈ స్థాయిని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించాలంటే ఈ తరహా జాగ్రత్తలు తప్పనిసరి అన్న భావనతో అదిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఈ నిర్ణయాన్ని నిఖార్సైన టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. చాలామంది నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అంటే ప్రాణం ఇచ్చే యువనేత బండారు అప్పలనాయుడు లాంటి వారైతే.. పార్టీ నిర్ణయాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎలాంటి స్వార్ధం లేకుండా ఎప్పటి నుంచో నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు ఇది న్యాయమైన గుర్తింపు అని కూడా ఆయన కొనియాడారు. పార్టీ తీసుకున్న ఈ ఉత్తమ నిర్ణయం నిజంగా గొప్పదని.. ఈ నిర్ణయం తీసుకున్న పార్టీ అదినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిజేశారు. ఈ అప్పలనాయుడు మరెవరో కాదు పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాడుగుల ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడే.