నిజ‌మే సారూ.. మ‌రి జ‌నంలోకి రావొచ్చుగా!

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌స‌మ‌స్య కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని.. పోలీసులను వినియోగించుకుని రెడ్ బుక్ రాజ్యాంగం న‌డిపిస్తున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. తాజాగా సోష‌ల్ మీడియా ఎక్స్‌లో ఆయ‌న సుదీర్ఘ పోస్టు చేశారు. దీనిలో అనేక విష‌యాలు వెల్ల‌డించారు. జిల్లాల వారీగా గ‌త వారంలో జ‌రిగిన అన్ని విష‌యాల‌ను పేర్కొన్నారు. ఒక వైసీపీ నాయ‌కుడిని గంజాయి పేరుతో వేధించార‌ని.. 2ల‌క్ష‌ల రూపాయ‌ల లంచం డిమాండ్ చేశార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.

అయితే.. ఆ మొత్తం ఇచ్చుకోలేక‌, వేధింపులు భ‌రించ‌లేక స‌ద‌రు నాయ‌కుడు శివ‌ల‌క్ష్మీనారాయ‌ణ ఆత్మహ‌త్య చేసుకున్న‌ట్టుగా జ‌గ‌న్ పేర్కొన్నారు. ఇక‌, శ్రీకాళ‌హ‌స్తిలో ఎమ్మెల్యే భార్య ఓ పోలీసుపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారనితెలిపారు.

అలాగే.. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయమ‌ని పేర్కొన్నారు. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారని జ‌గ‌న్ ఆరోపించారు. ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింద‌న్నారు. ఇలా.. అనేక విష‌యాల‌ను జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల స‌మ‌స్యను ప్ర‌భుత్వ‌మే సృష్టిస్తోంద‌ని చెప్పారు.

అయితే.. జ‌గ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌క్క‌న పెడితే.. రాష్ట్రంలో ఇంతగా ప‌రిణామాలు చోటు చేసుకుంటే ప్ర‌శ్నించాల్సిన జ‌గ‌న్ బెంగ‌ళూరులో తిష్ఠ‌వేయడం ఏంట‌నేది ఇప్పుడు తాజాగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించాల‌ని.. లేదా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌ని అనుకున్నప్పుడు.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండాలి. ప్ర‌జ‌ల‌తోనే మ‌మేకం కావాలి. కానీ, ఈ విష‌యాన్ని విస్మ‌రించిన జ‌గ‌న్‌.. కేవ‌లం ఎక్స్‌కే ప‌రిమితం కావ‌డంతో ప్ర‌యోజ‌నం ఏంట‌నేది సొంత పార్టీ నాయ‌కులే ప్ర‌శ్నిస్త‌న్నారు. ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల‌ని అనుకుంటే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కురావాల‌ని సూచిస్తున్నారు.