జూన్ 4పై పవన్ మార్కు పవర్ పంచ్ డైలాగ్

జూన్ 4… ఆ రోజు ఏపీలో రాజకీయంగా పెను ప్రకంపనలే సంభవించనున్నాయి. ఇప్పటికే విపక్ష వైసీపీ జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటించింది. కూటమి పాలనపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ దిశగా ఆ పార్టీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. అయితే అదే రోజున కూటమి పార్టీలకు కూడా అత్యంత ముఖ్యమైన రోజే. ఎందుకంటే… ఆ రోజే వైసీపీ పాలనకు తెర పడి కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి పోటీ అని కాదు గానీ…తన విజయోత్సవాలను కూటమి పార్టీలు ఘనంగా నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ తో కూడిన ప్రకటనను ఆదివారం విడుదల చేశారు.

జూన్ 4న సుపరిపాలన మొదలైన రోజు మాత్రమే కాదని చెప్పిన పవన్… అదే రోజు రాష్ట్రానికి పట్టిన పీడకు విరగడ అయిన రోజు కూడా అదేనని పంచ్ డైలాగ్ సంధించారు. ఇలాంటి అరుదైన ప్రత్యేక రోజును సంక్రాంతి, దీపావళి కలబోసిన మాదిరిగా ఘనంగా నిర్వహించుకుందామని ఆయన కూటమి పార్టీలతో పాటుగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రెండు పండుగలనే పవన్ ఎందుకు ప్రస్తావించారన్న విషయానికి వస్తే… సంక్రాంతి అంటే కొత్త పంటలతో అన్నదాతల లోగిళ్లు కళకళలాడతాయి. అంటే ఇది కూటమి సుపరిపాలనకు గుర్తు అన్నమాట. అదే సమయంలో దీపావళి అంటే… నరకాసురుడి పీడ విరగడ అయిన రోజు కాబట్టి… దుర్మార్గ వైసీపీ పాలనకు చరమ గీతం పాడిన రోజు కూడా అదేనన్న భావన వచ్చేలా ఆయన ఈ రెండు పండుగల కలబోతగా అభివర్ణించారు.

ఇలా తనదైన శైలి పంచ్ డైలాగులతో సంధించిన ఈ ప్రకటనలో కూటమి పార్టీలకు ఆయన ఓ ప్రత్యేక సూచన చేశారు. జూన్ 4ను పండుగలా జరుపుకుందామని, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ వేడుకలకు సంబంధించి విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేద్దామని కూడా ఆయన పిలుపునిచ్చారు. జూన్ 4న ఇటు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రాగా… కేంద్రంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఈ రెండు విజయాల కలబోత అయిన జూన్ 4ను ఘనంగా ఓ పండగలా నిర్వహించుకుందామని ఆయన కూటమి పార్టీలకు పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే… జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట వైసీపీ భారీ ఎత్తున నిరసనలకు తెర తీయగా… ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితుల్లో జనం అంతగా ఆ పార్టీ నిరసనలకు హాజరయ్యే అవకాశాలు లేవన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అదే సమయంలో కూటమి పార్టీలు తమ విజయోత్సవాలను ఓ రేంజిలో నిర్వహించేందుకు సన్నద్ధం అవడం చూస్తుంటే… వైసీపీ వెన్నుపోటు నిరసనలు తుస్సుమనడం ఖాయమేనన్న వాదనలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మొత్తంగా జూన్ 4న ఏపీలో ఇటు అధికార కూటమి, అటు విపక్ష వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో రాష్ట్రం హీటెక్కిపోవడం ఖాయమని చెప్పక తప్పదు.