ఆళ్ల రెడ్డి స్కూటీకీ డ్రైవర్ ను పెట్టుకున్నారే!

వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సింప్లిసిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుచరులు, వైసీపీ నేతలు నిత్యం చెబుతూనే ఉంటారు. ఓ ఎమ్మెల్యేగా ఉండి కూడా… తన పంట పొలాల్లో తానే స్వయంగా సాగు చర్యలు చేపడతారని, దూర ప్రయాణాలకు వెళ్లాలంటే రైలు ఎక్కేస్తారని, చేతిలో ఓ చిన్న సంచితోనే బయలుదేరతారని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నా కూడా సింపుల్ గా ఉండటం గొప్పతనమే గానీ…మరీ ఆళ్ల రెడ్డి గారి వాలకం చూస్తుంటే… ఇదంతా మొత్తం షో పుటపేనన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ హయాంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నాడు కేసు నమోదు అయినా విచారణ సరిగ్గా జరగలేదు. నిందితుల్లో ఏ ఒక్కరూ అరెస్టు కాలేదు. ఈ క్రమంలో కూటమి పాలన మొదలయ్యాక దీనిపై విచారణ జోరందుకోగా…ఇప్పటికే చాలా మంది అరెస్టు అయ్యారు. వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలు ముందస్తు బెయిల్ లు తెచ్చుకుని అలా తాత్కాలిక రక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఘటనలో ఆళ్లకూ పాత్ర ఉందన్న ఆరోపణలతో మంగళగిరి పోలీసులు మాజీ ఎమ్మెల్యేను విచారణకు పిలిచారు.

సరే… విచారణకు పిలవంగానే వచ్చేసిన ఆళ్ల రెడ్డి.. మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తన స్కూటీపై వచ్చారు. కారు ఉంటే… డ్రైవర్లను నియమించుకున్న వారిని చూశాం గానీ… ఆళ్ల మాత్రం స్కూటీకి కూడా డ్రైవర్ ను పెట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే…స్కూటీ వెనుక భాగాన ఆళ్ల రెడ్డి కూర్చోగా… మరో వ్యక్తి దానిని నడుపుకుంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ వీడియోను రికార్డు చేసుకున్న కొందరు వ్యక్తులు… ఆళ్ల రెడ్డి గారి సింప్లిసిటీ చూశారా? పోలీసు విచారణకు తన స్కూటీపై వచ్చారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆళ్ల రెడ్డి సింప్లిసిటీ మాట దేవుడెరుగు… స్కూటీకి కూడా డ్రైవర్ ను పెట్టకున్న నేతగా ఇప్పుడు ఆళ్ల రెడ్డి గారి పేరు మారుమోగిపోతోంది.

ఇదిలా ఉంటే… టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో పోలీసుల విచారణకు హాజరైన ఆళ్ల… విచారణ ముగిసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు తాను మంగళగిరిలోనే లేనని, అసలు ఆ రోజు ఈ దాడి గురించిన విషయమే తనకు తెలియదని ఆయన తెలిపారు. దాడికి సంబంధించిన ఏ ఒక్క సీసీటీవీ ఫుటేజీలోనూ తాను లేనన్నారు. ఈ కేసులో విచారణకు హాజరైన వారిలో ఏ ఒక్కరూ తన పేరు చెప్పి ఉండరన్నారు. రాజకీయ కక్షపూరితంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.