కడప గడ్డపై టీడీపీ నిర్వహించిన పసుపు పండుగ మహానాడు చూశాక.. తమ పార్టీలోనూ మార్పులు చేయక తప్పదన్న సంకేతాలను వైసీపీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. ఒక మార్పు మంచిదే అన్నట్టుగా నాయకులు గుసగుసలాడుతున్నారు. బలమైన గళం, ప్రత్యర్థులను వెంటాడడం, ప్రజలను మానసికంగా సంసిద్ధులను చేయడం వంటివి మహానాడులో స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది చాలా జోరుగా, తీవ్రంగానే జరుగుతోంది.
“మేం ఊహించిన దానికంటే మహానాడు బాగానే జరిగింది. మా వాళ్లు ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేకపోతే.. ఈ ప్రచారంలో పడి మేం కొట్టుకుపోతాం,” అని అనంతపురానికి చెందిన ఓ మాజీ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇది వాస్తవం. టీడీపీ మహానాడును గమనిస్తే.. ఎన్నికల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. వైసీపీ చెబుతున్నట్టు ‘సూపర్ సిక్స్’ను పట్టుకుని వేలాడలేదు. వాటిపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని కూడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పైగా.. ‘సూపర్ సిక్స్’పై మరింత బలమైన ప్రచారాన్ని చేశారు. తద్వారా మహానాడు విజృంభణ ఒకరకంగా ప్రజలకు బలమైన సంకేతాలు పంపించింది. అంతేకాదు, టీడీపీకి రెండు బలమైన కంచు కంఠాలు ఉన్నాయన్నది స్పష్టమైంది. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా విజృంభించి ప్రసంగించారు. ప్రజల మనసులను చూరగొనే ప్రయత్నంలో ఠారెత్తించారు. ఏం చేశారు? ఏం చేస్తారు? అనేది పక్కన పెడితే.. బలమైన వాయిస్ వినిపించడం ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఇది టీడీపీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది. బీజేపీతో జతకట్టినా, దానిని సమర్థించుకున్న తీరు.. రాష్ట్రానికి మేలు చేసేలా పనులు చేయిస్తామన్న విధానం వంటివి ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇవి వైసీపీలో చర్చకు రావడం గమనార్హం. అందుకే మహానాడు విఫలమైందన్న చర్చను మొదలు పెట్టాలని అనుకున్న నాయకులు కూడా వెనక్కి తగ్గారు. “మహానాడు చూశాక.. మాకు కూడా బలమైన గళాల అవసరం ఏర్పడిందని అనిపించింది,” అని విజయవాడకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
సో.. మొత్తానికి మహానాడు టీడీపీ కంటే కూడా వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది.