-->

దటీజ్ టీడీపీ…మహానాడు వేదికపై కార్యకర్తకు గౌరవం

కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడూరు నుంచి కడపకు 60 ఏళ్ల వయసున్న టీడీపీ కార్యకర్త ఒకరు సైకిల్ తొక్కుకుంటూ మహానాడుకు వచ్చారని, ఇటువంటి కార్యకర్తలు ఉండడం పార్టీకి పూర్వజన్మ సుకృతం అని అన్నారు. మనందరం ఈ మాదిరిగానే ఉంటే వైఎస్ఆర్ సీపీకి అడ్రస్సే ఉండదు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో జోష్ నింపాయి.

సాధారణ కార్యకర్తలను టీడీపీ ఎప్పుడూ గౌరవిస్తుందని చంద్రబాబు మరోసారి నిరూపించారు. గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్న వైసీపీ నేతలపై అంజిరెడ్డి తాత తొడగొట్టిన వైనాన్ని కూడా చంద్రబాబు గతంలో ప్రస్తావించారు. తాజాగా మహానాడు సందర్భంగా కోడూరు నుంచి కడపకు సైకిల్ మీద వచ్చిన 60 ఏళ్ల పెద్దాయనను చంద్రబాబు గౌరవించారు.

ఈ వయసులో సైకిల్ తొక్కుకుంటూ మహానాడుకు వచ్చిన ఆ కార్యకర్తకు గౌరవసూచికంగా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని చంద్రబాబు సూచించారు. దీంతో వేదికపై ఉన్న లోకేశ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, సభకు హాజరైన వారు అందరూ లేచి ఆ పెద్దాయనను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహానాడు వంటి భారీ బహిరంగ సభలో ఒక సాధారణ కార్యకర్తకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు… దటీజ్ చంద్రబాబు అని టీడీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని చంద్రబాబు అన్నారు. కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామని చెప్పారు. కడపలో మహానాడు పెడుతున్నారా అని అంతా అనుకున్నారని గుర్తు చేసుకున్నారు. నెల్లూరు పక్కన సముద్రం ఉందని, కానీ కడపలో ఈరోజు జనసంద్రం చూస్తున్నానని చంద్రబాబు చెప్పారు. పార్టీ శ్రేణులతో కడప ‘జన’ దిగ్బంధమైందని, అన్ని దారులు కడపవైపే ఉన్నాయని అన్నారు.