ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఓ రేంజి సహాయం అందుతోంది. అడిగిన వాటితో పాటు అడగని వాటికి కూడా కేంద్రం ఏపీలోని ప్రాజెక్టులకు ఇతోదికంగా నిధులు విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం… ఏపీలోని బద్వేల్, నెల్లూరుల మధ్య రహదారిని 4 లేన్ రహదారిగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అదికారికంగా ప్రకటించగా… ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈ రోడ్డు మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగులో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సందేశాన్ని చూసిన జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పులకించి పోయారని చెప్పక తప్పదు.
వాస్తవానికి ఇప్పటిదాకా ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో మెజారిటీ మంది నేతలు ఉత్తరాదిపైనే ప్రత్యేక దృష్టి సారించేవారు. ఒకరిద్దరు ప్రధానులు మినహా దక్షిణాది రాష్ట్రాలను అందులోనూ తెలుగు రాష్ట్రాలను పట్టించుకున్నవారే లేరంటే కూడా అతిశయోక్తి కాదు. ప్రధాని మోదీ మాత్రం ఏపీ పట్ల. ఏపీ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. పీఎంగా హ్యాట్రిక్ కొట్టిన వెంటనే ఆయన రాజధాని అమరావతికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు, హడ్కోలతో రుణాలు ఇప్పించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టే దిశగా ప్రోత్సహిస్తున్నారు. వెరసి గతంలో ఎన్నడూ లేనంతమేర కేంద్రం నుంచి ఏపీకి సహాయ సహకారాలు లభిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు ఏది అడిగినా కూడా మోదీ కాదనడం లేదు. అదే సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగినా కూడా మోదీ కాదనడం లేదు. వెరసి ఏపీకి కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. తన సొంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలకు కూడా మోదీ పెద్ద ఎత్తున నిదులు మంజూరు చేస్తున్నా… ఎందుకనో గానీ ఏపీకి దేనిని కేటాయించినా దానిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మోదీ సాగుతున్నారు. తాజాగా బద్వేల్. నెల్లూరుల మధ్య 4 లేన్ రహదారిని మంజూరు చేసిన మోదీ దానిని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తొలుత ఆంగ్లంలో పోస్టును పెట్టిన మోదీ… ఆ తర్వాత మరోమారు సదరు పోస్టును తెలుగులోనూ పోస్ట్ చేసి ఏపీపై తనకున్న ప్రేమ ఏపాటిదో చాటుకున్నారు.
బద్వేల్, నెల్లూరుల మధ్య 4 లేన్ రహదారిని మంజూరు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ పెట్టిన పోస్టును చూసిన పవన్ కల్యాణ్ నిజంగానే పులకించిపోయారు. ఆ వెంటనే ఆయన మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తాను ఓ పోస్టు పెట్టారు. ఈ రహదారి మంజూరు చేసిన ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా పవన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మారితే… కృష్ణపట్నం పోర్టుకు ఏకంగా 33.9 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ రహదారి ఏపీ పురోభివృద్దిలో కీలక భూమిక పోషించనుందని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ రహదారిపై అటు మోదీ, ఇటు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ వరుస పోస్టులు పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.