ఏపీని ప్రపంచంలోనే ముందుండేలా చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కడపలో జరుగుతున్న మహానాడులో రెండో రోజు మాట్లాడిన ఆయన.. యోగా నిర్వహణపై ప్రత్యక తీర్మానం చేశారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏపీ ఆతిథ్యం ఇస్తున్నట్టు చెప్పారు. దీనికి ప్రధాని మోడీ హాజరు అవుతున్నారని.. అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రతినిధులు కూడా వస్తున్నారన్న ఆయన.. ఈ క్రమంలో ఏపీ అభివృద్ధిని కూడా ప్రపంచ స్థాయికి వివరించే కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు.
మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా.. మన పేరు మార్మోగేలా యోగాను నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఆర్కే బీచ్ నుంచి భీముని పట్నం వరకు 5 లక్షల మందితో 25 కిలో మీటర్ల మేరకు యోగా ను చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. దీనికి టీడీపీ కార్యకర్తలు తరలి రావాలన్నారు. ఇలా నిర్వహించడం.. ఒక్క ఎన్డీయే ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు.
యోగాలో పాల్గొనడం గర్వకారణమన్న చంద్రబాబు.. దీనిలో ముఖ్యంగా మంత్రులు అందరూ పాల్గొనాలని సూచించారు. ఒత్తిడి, పనిభారంతో ఇబ్బంది పడుతున్న మంత్రులకు యోగా ద్వారా కొంత ఉపశమనం దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసోత్సవంగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. మన అందరికంటే కూడా.. విద్యాశాఖ మంత్రి(లోకేష్)పైనే ఎక్కువగా బాధ్యత ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 20 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి ఊళ్లకు ఊళ్లు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యోగా శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు చెప్పారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.