=

అర్థమైందా రాజా?..జగన్ పై లోకేశ్ సెటైర్లు

కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలానుగుణంగా పార్టీలో మార్పులు రావాల్సిన అవసరముందని లోకేశ్ అన్నారు. రాబోయే 40 ఏళ్లు పార్టీని విజయవంతంగా నడిపించేందుకు అవసరమైన అంశాలపై చర్చకు మహానాడు వేదిక కావాలని అన్నారు. పార్టీ జెండా ఎత్తినప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు లోకేశ్.

కార్యకర్తలే టీడీపీ అధినేతలని లోకేశ్ అన్నారు. అంజిరెడ్డి తాతా, మంజుల అక్క, తోట చంద్రయ్య అన్న తనకు స్ఫూర్తి అని చెప్పారు. పుంగనూరులో నామినేషన్ వేస్తాను..ఎవడు అడ్డొస్తాడో రండి అంటూ వైసీపీ నేతలపై తొడగొట్టిన అంజిరెడ్డి తాత తనకు స్ఫూర్తినిచ్చారని లోకేశ్ అన్నారు. ఇక, పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతోందని తెలిసి అడ్డుకున్న మంజుల అక్కపై దాడి చేశారని, రక్తం కారుతున్నా సరే చివరి ఓట్ పోలయ్యే వరకు బూత్ లో నుంచి కదలని మంజుల అక్క తనకు ఆదర్శమని చెప్పారు.

అన్న తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఏకంగా కత్తి మెడపై పెట్టి ప్రత్యర్థి పార్టీ అధినేతకు జై కొట్టమని బెదిరించారని, అలా చేస్తే ప్రాణాలతో వదిలేస్తామని అన్నారని గుర్తు చేసుకున్నారు. కానీ, మెడపై కత్తి పెట్టినా..ప్రాణాలు పోతాయని తెలిసినా…జై టీడీపీ…జై చంద్రన్న అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్యను తాను ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. అందుకే, తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిందని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని, సొంత తల్లి, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని లోకేశ్ అన్నారు. అలా చేయడం వల్లే ఓటమి పాలయ్యారని అర్థమైందా రాజా…అంటూ జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. నాయకుల చుట్టూ కాదు….ప్రజల చుట్టూ తిరగాలని..అలా చేసిన వారిని పార్టీయే వెతుక్కుంటూ వచ్చి గుర్తింపునిస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి మంది సభ్యులు ఒక టీడీపీకే సొంతం అని అన్నారు.

తెలుగు వారి కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి, అన్నదాతకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు.