వైసీపీకి పునాదులు అనదగ్గ నాయకులు అరెస్టు అయిపోయారు. అందునా.. వివాదాలకు చాలా చేరువగా.. పార్టీ అధినేతపై ఈగ కూడా వాలనివ్వకుండా.. చూసుకున్న నాయకులు జైళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలు.. వైసీపీ పునాదుల నుంచి పగుళ్లు పట్టేసిన పరిస్థితిని కళ్లకు కడుతోందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు నుంచి తప్పించేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయి. దీనికి కూడా రెండు కారణాలు ఉన్నాయి.
1) రెడ్డి సామాజిక వర్గంలో ఐకాన్ నాయకుడిగా గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. 2) వివాదాలకు అత్యంత దూరంగా కూడా ఆయన ఉంటారు. దీంతో ఆయన క్రెడిబిలిటీ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, నెల్లూరు జిల్లా రుస్తుంబాదలోని గనుల్లో జరిగిన అవకతవకలు.. ఎస్టీపై దాడుల నేపథ్యంలో గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నేరం చేయలేదని ఆయన చేశారని పోలీసులు చెబుతున్నారు. సరే.. ఈ విషయం ఎలా ఉన్నా.. రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం కాకాని అరెస్టు సంచలనంగా మారింది.
ఇది పార్టీకి డ్యామేజీ చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇప్పటికే ఎన్నికల కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై కూడా హత్యా నేరం కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరిపైనా ఏ6,. ఏ7గా పల్నాడు పోలీసులు కేసులు పెట్టారు. వీటిని తేలికగా తీసు కునే అవకాశం లేదు. ఈ పరిణామంతో పల్నాడు జిల్లాలో వైసీపీ మరింత కుదేలైంది. టీడీపీ నాయకుల హత్య కేసులోనే వీరిపై కేసులు నమోదు చేయడం గమనార్హం.
ఇక, పిన్నెల్లి సోదరులను అరెస్టు చేస్తే.. ఏం జరుగుతుందన్న చర్చ కూడా ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ఒక జిల్లాను శాసించగల నాయకులుగా వారికి పేరుంది. ఇక, ఇప్పటికే అరెస్టు అయిన.. వంశీ వల్లభనేని వంటివారితోనూ పార్టీ ఇబ్బంది పడుతోంది. అంతో ఇంతో సానుకూలంగా ఉండే.. ఆయన సామాజిక వర్గం కూడా.. కారాలుమిరియాలు నూరుతోంది. ఇలా.. వైసీపీ సానుకూలమైన రెడ్డి సామాజిక వర్గం.. కడు దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఇక కమ్మ సామాజిక వర్గంలోనూ పార్టీపై నమ్మకం సన్నగిల్లడం వంటివి వైసీపీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరోవైపు.. జూన్ 4న వెన్నుపోటు కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. ఈలోగానే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. ఇది మరింతగా వైసీపీని ఇరుకున పడేస్తుందని అంటున్నారు పరిశీలకులు.