వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో ఆ పార్టీలో తీవ్ర అలజడి నెలకొంది. ఇప్పటికే చాలా మంది నాయకులు అరెస్టు కావడం.. మరోవైపు కేసులు తరుముతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో పార్టీలో తీవ్ర ఆవేదన.. ఆందోళన నెలకొంది. జగన్ తక్షణమే బయటకు రావాలన్న నినాదాలు కూడా ఊపందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాకాని అరెస్టు తర్వాత.. జగన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.
ఇదిలావుంటే..ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుందా? ఇకనైనా ఆగుతుందా? అనే విషయంపై విజయవాడ పోలీసులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇంకా అయిపోలేదు” అంటూ.. ముఖ్య అధికారి ఒకరు మీడియా ముందు వ్యాఖ్యానించారు. కాకాణి అరెస్టుపై వివరాలు కోరుతూ.. విజయవాడ సీనియర్ అధికారిని మీడియ ప్రశ్నించినప్పుడు.. ఆయన చెప్పిన సమాధానం ఇదే. దీనిని బట్టి వైసీపీ నేతల అరెస్టులు మరిన్ని కొనసాగుతాయన్న సంకేతాలు వచ్చాయి.
అయితే.. వీరిలో ఎవరెవరు ఉన్నారన్న విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాలను గమనిస్తే.. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనపై చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు అనేక ఫిర్యాదులు చేశారు. గనులు, అటవీ భూముల ఆక్రమణలు, మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో పత్రాల దహనం.. సహా ఎన్నికల సమయంలో తమ్ముళ్ల బెదిరింపులు.. చంద్రబాబు పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలోని అంగళ్లలో జరిగిన వివాదం.. రాళ్ల దాడి.. ఇలా అనేక కేసులు పేరుకు పోయాయి.
అయితే.. ఇప్పటి వరకు ఒక్క కేసులోనూ పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా తూర్పుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే క్రమంలో ధియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన నలుగురిలో ఆయన పేరు ఉందని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో బియ్యం ఎగుమతుల కేసు కూడా ఉంది. ఇలా.. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.