ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాంగ్ స్టెప్ వేశారా? ఆయన దానిని సరిచేసుకునేందుకు అవకాశం ఉందా? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్నచర్చ. అయితే.. దీనిపై రెండు కోణాల్లో వాయిస్ వినిపిస్తోంది. 1) వ్యక్తిగతంగా షర్మిల రాంగ్ స్టెప్ వేయడం. 2)పార్టీ పరంగా ఆమె రాంగ్ స్టెప్ వేయడం. ఈ రెండు విషయాలు కూడా పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారనేది అందరికీ తెలిసిందే.
ఆమె ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా.. పెద్దగా స్పందన అయితే లేదు. పోనీ.. సీనియర్ నాయకులు ఎవరై నా వస్తున్నారా? ఆమెకు అండగా ఉంటున్నారా? అంటే.. అది కూడా లేదు. పైకి ఆయా విషయాలు సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం వాటిపై అంతర్మథనం సాగుతోంది. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్.. తాజాగా నిర్వహించిన ఫోన్ కాల్ భేటీలో ఆయా అంశాలపైనే చర్చించినట్టు సమాచారం. పార్టీని ముందుకు నడిపించాలని ఆయన తేల్చి చెప్పారు.
అయితే.. తనకు ఎవరూ సహకరించడంలేదని.. తన వెంట ఎవరూ లేరని ఈసందర్భంగా షర్మిల వ్యాఖ్యా నించారు. అయితే.. తన వెర్షన్ తను చెప్పినా.. ఇదేసమయంలో పార్టీ సీనియర్లు చెప్పిన విషయాలను మాణిక్కం ఆమె ముందు పెట్టారు. పార్టీలో సీనియర్లను కలుపుకొని ముందుకు సాగడం లేదని.. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవడంలేదని.. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇవన్నీ.. రాంగ్ స్టెప్పులేనని చెప్పిన ఆయన.. వీటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచించారు. అంతేకాదు.. వ్యక్తిగత అజెండాలతో పార్టీ ఎదుగుదల ఉండదని కూడా తేల్చి చెప్పిన ఆయన.. పార్టీని ప్రజల వద్దకు తీసుకువెళ్లే క్రమంలో అన్ని విధాలా నాయకులనుకలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. మార్పు రాకపోతే.. పార్టీ ఎప్పటికీ ఇలానే ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. మరి షర్మిల మారతారా? లేదా? చూడాలి.