వైసీపీ నాయకులు, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నానీ, పేర్ని నానీలపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వరుస పెట్టి వాయించేశారు. ఒక్కొక్కరినీ పేరు పెట్టి మరీ వాయించేశారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న.. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక్కొక్కరి చరిత్రా ప్రజలకు తెలియదనుకున్నారా? అంటూ.. పేర్ని నానీపై విరుచుకుపడ్డారు.
బుద్దా ఏమన్నారంటే..
“జైల్లో ఉన్న వల్లభనేని వంశీ స్వాతంత్య్ర సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నానీ తెగ బిల్డప్ ఇస్తున్నాడు. పేర్నీ నానీ నీకు అస్సలు సిగ్గు ఉందా.. నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పు. తప్పుడు పనులు చేసింది కాకుండా.. నీ భార్య పేరు పెడతావా? చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన నువ్వు.. ఇప్పుడు విశ్వాస ఘాతకుడిగా మాట్లాడతావా? బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర నీది. అతను హత్యా రాజకీయాలు చేసే వ్యక్తా.. నీకు తెలియదా?. అటువంటి సౌమ్యుడిని 55రోజుల పాటు జైల్లో పెట్టించావు. రవీంద్ర మామయ్య నడకుదిటి నరసింహారావు మానసికంగా కుంగిపోయి చనిపోయేలా చేశావు” అని నిప్పులు చెరిగారు.
‘
అంతేకాదు.. వంగవీటి మోహన రంగాతో వంశీని పోల్చడంపైనా బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. “రంగాతో వంశీకి పోలికా.. నానీ నీ బుర్ర పని చేస్తుందా? పేదవాళ్లను అడ్డం పెట్టుకుని వంశీ డబ్బులు కొట్టేసిన వ్యక్తి. నానీ నువ్వు మోకాళ్ల మీద కూర్చుని రంగా అభిమానులు, ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు క్షమాపణలు చెప్పాలి. నీ కులం వారిని నువ్వే కించపరిస్తే… జగన్ దగ్గర మార్కులు కొట్టేయవచ్చని చూస్తున్నావు. గతంలో పవన్ కళ్యాణ్ పైనా ఇలాగే నోరు పారేసుకున్నావు. ఇఫ్పుడు వంశీ వంటి నీచుడిని రంగాగారితో పోలిస్తే.. నీ కులం వాళ్లే నిన్ను చెప్పులతో కొడతారు.” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
వంశీ, కొడాలి నానీ లు చంద్రబాబు కుటుంబాన్ని ఎలా తిట్టారో నీకు తెలియదా?. వారి బూతుల వల్లే వైసీపీ ఓడిపోయిందని మీ వాళ్లే చెబుతున్నారు. నీవు సిగ్గు లేకుండా ఇంకా ఎలా మాట్లాడుతున్నావు. అవాస్తవాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవడమే మీ వైసీపీ నాయకుల చరిత్ర. చంద్రబాబు, కొల్లు రవీంద్ర, అచ్చెంనాయుడులు, జనార్ధన్ రెడ్డిలు అక్రమంగా అరెస్టు చేశారు. వంశీని అక్రమ అరెస్టు అని ఎవరైనా చెప్పగలా.. ఆయన పిల్లలు కూడా వచ్చి చూడటం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఛీ కొట్టే నైజం వంశీది. వంశీది వికృత రూపం అని సోషల్ మీడియాలో ప్రజలే పోస్టులు పెడుతున్నారు” అని బుద్దా నిప్పులు చెరిగారు.