ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు తాజాగా నూతన ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారి కోడలు.. నారా బ్రాహ్మణి కొత్తింట్లో పాలు పొంగించి.. సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా కాకుండా.. ప్రైవేటుగానే నిర్వహించారు. దీంతో మీడియాను ఎలో చేయలేదు.
ఇక, ఈ నూతన ఇంటి విషయానికి వస్తే చంద్రబాబు సొంత నియోజకవర్గం.. కుప్పంలోని శాంతిపురం మండలం, శివపురం వద్ద నిర్మించుకున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు చంద్రబాబును ఎద్దేవా చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడ నుంచి విజయం దక్కించుకుంటున్నా.. కనీసం సొంత ఇల్లు అంటూ లేదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్వయంగా భూమి ఎంపిక చేసి.. నూతన ఇంటి నిర్మాణంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. 2023లో శంకు స్థాపన జరిగిన ఈ ఇంటి నిర్మాణం.. వడివడిగా సాగింది. పార్టీ కార్యాలయాన్ని.. పార్కింగ్ ఏరియాను కలుపుకోని భారీ రేంజ్‌లోనే ఈ నివాసాన్ని నిర్మించారు. సుమారు 25 కోట్ల రూపాయలకు వెచ్చించినట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఆదివారం ఉదయం చంద్రబాబు దంపతులు నూతన గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, నారా వారి కోడలు.. బ్రాహ్మణి.. నూతన గృహంలో పాలు పొంగించారు. అయితే.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలను ఆహ్వానించారు. ఎక్కడికక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. నారా లోకేష్ దంపతులు కూడా ఈ పూజల్లో కూర్చున్నారు.