టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికలకు ముందు.. ప్రజల కోసం ఆయన ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆరు కీలక పథకాలను ప్రకటించారు. వీటిలో దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగిలిన వాటిని త్వరలోనే అమలు చేయనున్నారు. వీటికి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలు మహిళలను మంత్ర ముగ్ధులను చేశాయి. వారిలో టీడీపీపై ఇమేజ్‌ను కూడా పెంచాయి.
ఇదిలావుంటే.. ఇప్పుటు టీడీపీ కార్యకర్తల కోసం.. వారిని పార్టీలో మరింత ఉత్తేజం చెందేలా తీర్చి దిద్దడం కోసం.. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఎలా అయితే.. సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించారో.. అలానే.. ఇప్పుడు పార్టీలో నాయకుల కోసం, కార్యకర్తల అభ్యున్నతి కోసం కూడా.. ‘సూపర్ సిక్స్’ను ప్రకటించనున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే మహానాడు వేదికగా.. ఈ సూపర్ సిక్స్‌ను వెల్లడిస్తారు.
ఏంటా సూపర్ సిక్స్..
- తెలుగుజాతి.. విశ్వఖ్యాతి: తెలుగువారు ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా నంబర్-1గా ఎదగాలనే లక్ష్యంతో ‘నా తెలుగు కుటుంబం’ ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు. దీనిలో టీడీపీ కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయనున్నారు.
- స్త్రీ శక్తి: మహిళా సాధికారత, మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో మద్దతు ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో టీడీపీలోని మహిళా నాయకులతో దీనిని అనుసంధానం చేయనున్నారు. ‘స్త్రీ శక్తి’ని మరింత బలోపేతం చేసి పార్టీని నమ్ముకున్న వారిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లనున్నారు.
- సోషల్ రీఇంజనీరింగ్: టీడీపీలోని అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు సమన్యాయం చేయనున్నారు. అంటే.. పదవులు , బాధ్యలను అందరికీ కేటాయించనున్నారు. ఇలా ‘సోషల్ రీఇంజనీరింగ్’ చేయనున్నారు.
- యువగళం: పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. యువత అభ్యున్నతే లక్ష్యంగా ఐడియాలజీపై చర్చించనున్నారు. పార్టీలో పనిచేస్తున్న యువతకు అవకాశాలు సృష్టించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతర ప్రణాళిక అమలు చేస్తారు.
- అన్నదాతకు అండ: అమరావతిలో భూములు ఇచ్చినట్టుగా.. రైతులు చాలా మంది పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నారు. వీరిని సాంకేతికంగా బలోపేతం చేయడం, సబ్సిడీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టి పెట్టనున్నారు.
- కార్యకర్తే అధినేత: ‘కార్యకర్తే’ అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం, విధానంగా ఉండబోతోంది. సీనియర్లను గౌరవించడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడేవారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు మహానాడు వేదికగా శ్రీకారం చుట్టనున్నారు.