వచ్చనెల 4న తాను జనంలోకి వచ్చి తీరుతానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఆ రోజు ‘వెన్ను పోటు’ పేరుతో కూటమి సర్కారు పై ఉద్యమించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రజలను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలిపి.. కలెక్టరేట్లలో ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. దీనిపై తాజాగా జగన్ ఓ ప్రకటన చేశారు. అయితే.. ఇలా ఇప్పటికి అనేక సందర్భాల్లో జగన్ ప్రకటనలు చేసినా.. ఆయన బయటకు రాలేదు.
కానీ, ఈ దఫా మాత్రం ఖచ్చితంగా తాను బయటకు వస్తానని.. ప్రజల మధ్యే ఉంటానని జగన్ చెబుతున్నారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని అంటున్నారు. అయితే.. జగన్ వేసిన ఈ స్కెచ్ వెనుక కీలక కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం ఎవరూ కోరకుండానే వచ్చే నెల 12 నుంచి పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. వీటిలో ప్రధానంగా ‘తల్లికి వందనం’ కార్యక్రమం ఉంది.
దీనిని వచ్చే నెల స్కూళ్లు తెరిచే నాటికి ప్రారంభిస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అదేవి ధంగా రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ విషయంపైనా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో కేంద్రం రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ యోజనతో దీనిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండు కార్యక్రమాలను కూడా వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రంగం రెడీ చేసుకుంటు న్నారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం.
అయితే.. ఇలాంటి కీలక సమయానికి నాలుగైదు రోజుల ముందు.. జగన్ ప్రజల్లోకి వస్తున్నారు. వెన్ను పోటు పేరుతో ఉద్యమిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో దానిని పరిశీలించి.. అప్పటికి కూడా.. ఆయా కార్యక్రమాలను అమలు చేయకపోతే.. జగన్ అప్పుడు ఉద్యమించి ఉంటే బాగుండేది. కానీ.. ముందుగానే ఆయన చేపట్టడం ద్వారా.. రేపు ప్రభుత్వం కార్యక్రమాలు ఎలానూ అమలు చేస్తుంది.
కాబట్టి.. వాటిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అంటే.. మేం ఉద్యమించాం కాబట్టి.. చంద్రబాబు పథకాలు అమలు చేస్తున్నారన్న ప్రచారం చేసుకునే వ్యూహం వేశారని అంటున్నారు. తద్వారా.. ప్రజల సానుభూతిని దూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేది చర్చగా మారింది. మరి దీనిని చంద్రబాబు ఎలా తిప్పికొడతారో చూడాలి.