ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నట్టుగానే వ్యవహరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మి కుల సమస్యలను పరిష్కరించకపోయినా.. తొలగించిన 2 వేల మంది ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోకపోయినా.. ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని.. రెండు రోజలు కిందట ఆమె ప్రకటించారు. అయితే.. ఆమె ప్రకటనను అందరూ లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ.. విశాఖ ఉక్కు యాజమాన్యానికి కానీ.. ఆమె ప్రకటన అర్ధం కానట్టుంది.
దీంతో ఎవరూ షర్మిల ప్రకటనపై స్పందించలేదు. దీంతో రెండు రోజులు గడిచినా.. విశాఖ ఉక్కు కర్మాగా రంకార్మికుల విషయంలో ఎవరూ రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రకటించినట్టు షర్మిల.. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంగణానికి ముందు.. ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. తను ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వస్తోందో .. ఆమె ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. అయితే.. ఈ కార్యక్రమంలో కూడా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరూ పాల్గొనక పోవడం గమనార్హం. మరి షర్మిల దీక్ష ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
ఏం జరిగింది?
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెండు రోజుల కిందట సంచలన ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి.. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె అల్టిమేటం జారీ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే.. తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై ఎవరూ స్పందించకపోవడం అన్నట్టుగానే ఆమె దీక్షకు కూర్చున్నారు.
ఇవీ షర్మిల డిమాండ్లు..
- తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి.
- ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని ప్రకటన చేయాలి.
- విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి శాశ్వత బొగ్గు గనులు కేటాయించాలి.
- ఉద్యోగుల్లో భయాందోళనలు తొలగించి.. వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలి.
- ఇటీవల ఇచ్చిన 11 వేల కోట్ల రూపాయలను గ్రాంటుగా ప్రకటించాలి.
- ఉక్కు కర్మాగారానికి తక్షణమే మరో 50 వేల కోట్ల రూపాయలను ఇవ్వాలి.