జనావాసాలపై ఎనుగుల దాడుల నుంచి ఏపీకి ఏళ్ల తరబడి ఊరటే లభించలేదు. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఏడాది తిరక్కుండానే ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఏనుగులను జనావాసాల నుంచి తరిమికొట్టే కుంకీ ఏనుగులను ఆయన ఏపీకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాకట రాజధాని బెంగళూరులోని విధాన సౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఏడాది క్రితమే పవన్ కుంకీ ఏనుగుల కోసం కర్ణాటకకు వినతి పంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వినతికి అనుగుణంగా కర్ణాటక 5 కుంకీ ఏనుగులను ఏపీకి అప్పగించింది.
కుంకీ ఏనుగులను స్వీకరించేందుకు స్వయంగా పవన్ కల్యాణ్ బుధవారం బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు పవన్ కు గ్రాండ్ వెల్ కమ్ పలికింది. కర్ణాటక అటవీ శాఖ మంత్రి పవన్ కాన్వాయ్ వద్దకు వచ్చి మరీ స్వాగతం పలికారు. ఇక వేదిక మీద పవన్ ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు తమ మధ్య కూర్చోబెట్టుకుని, ఆ తర్వాత పవన్ కు ఇరువైపులా వారు నిలుచుని పవన్ ను ట్రీట్ చేసిన తీరు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేసింది. పొరుగు రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కర్ణాటక సీఎం సహా డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు రిసీవ్ చేసుకున్న తీరు నిజంగానే అద్భుతమని చెప్పాలి.
ఈ సందర్భంగా ఏడాది క్రితమే ఏపీకి కుంకీ ఏనుగులను అప్పగించేందుకు అంగీకరించిన ఒప్పంద పత్రాలు, కుంకీ ఏనుగులను అప్పగింతకు సంబంధించిన పత్రాలను ఓ బ్రీఫ్ కేసులో పెట్టి… సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు పవన్ చేతిలో పెట్టిన దృశ్యాలు కూడా అమితంగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ వేడుక కన్నుల పండువగా జరిగిందని చెప్పక తప్పదు. ఈ కుంకీ ఏనుగుల కోసం ఇప్పటికే పలమనేరు పరిధిలోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటిని ఇప్పుడు బెంగళూరు నుంచి నేరుగా అక్కడికే తరలించనున్నారు.