మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ పెడుతోంది. ఎందుకో చూద్దాం. 2026 టాలీవుడ్ వేసవి బూడిదలో పోసిన పన్నీరయ్యింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కటంటే ఒక్కటి సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు. డెకాయిట్ హిట్టయినా రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు రాలేదు. పబ్లిసిటీ ఎక్కువ విషయం తక్కువ బాపతు చిన్న సినిమాల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది.

ఒకవేళ కాస్తంత ముందస్తు ప్లానింగ్ తో విశ్వంభర వేగంగా అడుగులు వేసి ఉంటే సమ్మర్ ఆడియన్స్ కి ఒక బెస్ట్ ఆప్షన్ అయ్యేది. విజువల్ ఎఫెక్ట్స్ మీద పని చేస్తున్నారు నిజమే. కానీ ఎంత కాలమనేది క్లారిటీ లేకపోతే ఎలా. వేల కోట్లతో తీసే అవతార్ లాంటి గ్రాండియర్ కి కూడా జేమ్స్ క్యామరూన్ ఇంత టైం తీసుకోలేదని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే దానికి సమాధానం చెప్పడం కష్టం. రిలీజ్ లేకపోతే లేకపోయింది కనీసం ఏదో ఒక అప్డేట్ అయినా ఇస్తూ ఉండాల్సింది.

ఇక్కడ పెద్దిని సాకుగా చూపించాల్సిన అవసరం లేదు. అసలు విశ్వంభర కాపీ సిద్ధంగా ఉంటే మార్చి 26, ఏప్రిల్ 30 లాంటి బ్రహ్మాండమైన డేట్లు విశ్వంభరకు పనికి వచ్చేవి. ఎలాగూ పెద్ది జూన్ కు వెళ్ళిపోయింది కాబట్టి ఆ మాత్రం గ్యాప్ సరిపోయేది. షూటింగ్ ఎప్పుడో అయిపోయిన సినిమాకు విఎఫెక్స్ పేరిట ఇంత కాలయాపన చేయడం పట్ల ఫ్యాన్స్ లో నిరసన వ్యక్తమవుతోంది. దీంతో అసలు ఈ టాపిక్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించడమే మానేశారు.

ప్రస్తుతం విశ్వంభర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద హనుమాన్ ఫేమ్ గౌరా హరి వర్క్ చేస్తున్నారనే లీక్ కొద్దిరోజుల క్రితం బయటికి వచ్చింది. యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు. ఒక ఐటెం సాంగ్ భీమ్స్ కంపోజ్ చేశారనేది ఓపెన్ సీక్రెట్. విశ్వంభర ఒరిజినల్ కంపోజర్ కం ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఉండగా ఆయనకి కాకుండా ఈ బాధ్యతలు వేరొకరికి ఇవ్వడం కూడా అనూహ్య నిర్ణయాలు. సరే విశ్వంభర ఇక ముందు ఎప్పుడు వచ్చినా కీలకమైన వేసవిని మిస్ చేసుకోవడం కాస్ట్లీ మిస్టేక్.