తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలతో చెలిమికి చేతులు చాస్తుంది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. మిత్ర పక్షాలపై నిప్పులు చెరుగుతుంది. తనే సొంతగా ఎదిగేందుకు.. సమీప పార్టీలను తుత్తునియలు చేసి.. మట్టి కరిపిస్తుంది.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో కమల నాథులు నిద్రపోతున్నారు. కానీ, వాస్తవం ఏంటంటే.. 2011కు ముందు.. అంటే ఖచ్చితంగా 15 ఏళ్ల కిందట ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మిత్ర పక్షం అంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ.. అప్పట్లో వెంపలి చెట్టు మాదిరిగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు మహా వృక్షమైపోయింది.
తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీనే.. ఇప్పుడు అడ్రస్ లేకుండా చేసేలా వ్యూహాత్మక అడుగులు వేసింది. వాస్తవానికి ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి మంచి మిత్రపక్షం. కేంద్రంలో అధికారం కూడా పంచుకున్నారు. రైల్వే శాఖ మంత్రిగా కూడా మమత పనిచేశారు. దీనికి కారణం బెంగాల్‌లో తను ఎదిగేందుకు అడ్డంకిగా ఉన్న కమ్యూనిస్టులను తొలగించుకునేందుకే!.
దీనికి అప్పట్లో బీజేపీ దోహద పడిందో లేదో తెలియదు కానీ.. కమ్యూనిస్టుల ప్లేస్‌ను కమల నాథులు రీప్లేస్ చేశారు. మమతతో జట్టుకు జల్ల కొట్టారు. ఆ పార్టీకే చెందిన సువేందు అధికారిని బయటకు తెచ్చారు. తమలో కలుపుకొని మమతపై సమరం ప్రకటించారు. రేపు(మే 4) ఏం జరుగుతుందో తెలియదు కానీ.. కోరి కోరి మమత పెంచి పోషించిన పార్టీనే ఇప్పుడు ఆమెకు పాశమై వెంటాడుతోందన్నది వాస్తవం.
మహారాష్ట్రలోనూ..
అయితే.. బీజేపీ ఒక్క బెంగాల్‌లోనే ఇలా చేసిందని అనుకుంటే పొరపాటే. మహారాష్ట్రలోనూ ఇలానే వ్యవహరించింది. ఒకప్పుడు బీజేపీకి మహారాష్ట్రలోనూ ప్రాతినిధ్యం లేదు. కానీ.. అప్పటికే బలంగా వేళ్లూనుకున్న శివసేన పార్టీతో చెలిమి చేసింది. నెమ్మది నెమ్మదిగా వార్డు స్థాయి నుంచిపుంజుకుంది.
తమ ఉద్యమానికి అంటే.. హిందూత్వకు బీజేపీ దన్నుగా ఉంటుందని నమ్మిన శివసేన.. బీజేపీని కౌగిలించుకుంది. కానీ,అది ధృతరాష్ట్ర కౌగిలి అవుతుందని సేన నాయకులు ఆనాడు తెలుసుకోలేక పోయారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ బీజేపీ పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ పార్టీని నిలువరించే క్రమంలో బీజేపీ తమకు అందివస్తుందని భావించింది.
ఈ క్రమంలోనే తొలి నాళ్లలో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. కానీ, తర్వాత తర్వాత.. అదే శివసేనలో ఏక్‌నాథ్ షిండేను వేరు పరిచిన బీజేపీ అధినాయకులు.. రాష్ట్రంలో శివసేన అడ్రస్‌ను ప్రశ్నార్థకం చేశారు. అంతేకాదు.. తమను నమ్మి బయటకు వచ్చిన శివసేన నేత ఏక్‌నాథ్ షిండేను కూడా పక్కన పెట్టి.. ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో పాగా వేశారు. ( షిండే ప్రస్తుతం కూటమిలోనే డిప్యూటీ సీఎం గా పని చేస్తున్నా, ఆయనకి ఉన్న ప్రాధాన్యత ప్రశ్నార్థకమే.)
అసోం నుంచి తమిళనాడు వరకు..
ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందు లతలా అల్లుకుని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని తర్వాత.. తనే మహా వృక్షమైన పరిస్థితులు ఉన్నాయి. అసోంలోని గణ పరిషత్ నాయకులను ఇలానే మచ్చిక చేసుకుని తన వైపు తిప్పుకొన్న కమలం పార్టీ ఆతర్వాత.. అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇక, తమిళనాడులోనూ ఈ ప్రయోగం చేయాలన్న ఉద్దేశంతోనే నాడు జయలలిత మరణాంతరం.. అన్నాడీఎంకే విలీనానికి ప్రతిపాదించారు. కానీ.. ఒప్పుకోకపోవడంతోనే శశికళను జైలుకు పంపించారన్న వాదన ఉంది. ఇలా.. కమల నాథుల అధికార కృత్యాల ముందు.. ప్రాంతీయ పార్టీలు కకావికలం అవుతున్నాయన్నది వాస్తవం.
తాజాగా అన్నాడీఎంకే బీజేపీతో చేతులు కలిపింది. రేపు ఆ పార్టీ కనుక అధికారంలోకివస్తే.. బీజేపీ వేసే వ్యూహాలు.. చేసే మతలబుల ముందు పళని స్వామి.. భరత నాట్యం(తమిళనాడు సంప్రదాయ కళ) ఆడక తప్పదని పరిశీలకులు చెబుతున్నారు.
ఏపీ పరిస్థితి ఏంటి?
బీజేపీ వ్యూహాలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి. పైకి ఏమీ చెప్పరు. అంతా బాగుందని మెప్పిస్తారు. ముందు పొగుడుతారు.. తర్వాత.. చేతులు కలుపుతారు.. ఆ తర్వాత చేయాల్సింది చేస్తారు.. ఇదీ రాజకీయ వర్గాల్లో బీజేపీ గురించి జరిగే చర్చ. ఏపీలో కూడా బీజేపీ తన వ్యూహాలను అమలు చేయదన్న గ్యారెంటీ ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు.
అయితే.. ఇప్పటికిప్పుడు చేయకపోయినా.. భవిష్యత్తులో అవకాశం, అవసరం చూసుకుని విజృంభించే అవకాశం ఉంటుందని అంటున్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి 1 శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. కానీ, టీడీపీతో చెలిమి చేసి.. 8-12 శాతం ఓటు బ్యాంకు దక్కించుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఇప్పుడు బీజేపీకి ఉన్నారు. టీడీపీ లేకుంటే బీజేపీకి ఈ సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉండేవారా? అంటే లేదనే సమాధానం అందరికీ తెలిసిందే.
ఇలానే పశ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీ ఎదిగింది. అప్పట్లో మమత కూడా ప్రస్తుతం చంద్రబాబు పొడిగినదానికంటే కూడా ఎక్కువగానే బీజేపీ భుజాన వేసుకున్నారు. కమ్యూనిస్టులను అణిచేయాలన్న వ్యూహంతో బీజేపీని చేరదీసి.. ఒడిలో కూర్చోబెట్లుకున్నారు. ఇప్పుడు ఏపీలో జగన్‌ను పక్కకు తప్పించాలన్న వ్యూహంతో బీజేపీకి పాలు పోస్తున్నారన్న వాదన ఉంది.
కానీ, చంద్రబాబు మాదిరిగా పట్టు విడుపుల రాజకీయాలు బీజేపీ చేయదు. కమలం కబంద హస్తం పెట్టిందంటే.. ఆ రాష్ట్రం తన చేతికి చిక్కాల్సిందే. ఇప్పుడు బెంగాల్ పరిస్థితి ఇదే. సో.. ఏపీ పాలకులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికిప్పుడు తమకు ఇబ్బంది లేదని భావించవచ్చు. కానీ.. బీజేపీ ఇప్పుడు రాజకీయాలు చూడదు. ప్రస్తుత రాజకీయాలను తన భవిష్యత్తు రాజకీయాలకు వేదికగా.. మెట్లుగా చేసుకునే అవకాశం ఉంది. దీనికి అనేక రాష్ట్రాలు ఉదాహరణ.
Gulte Telugu Telugu Political and Movie News Updates