దురంధ‌ర్ బాట‌లో పెద్ది?

చిన్న‌ సినిమాల‌కు రిలీజ్ రోజు కంటే ఒక‌టి రెండు రోజుల‌ ముందే పెయిడ్ ప్రిమియ‌ర్స్ ఎప్ప‌ట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద సినిమాలకు ఇలా ప్రిమియ‌ర్స్ వేయ‌డానికి అంతగా ఆస‌క్తి చూపించేవాళ్లు కాదు నిర్మాత‌లు. మ‌హా అయితే తెల్ల‌వారుజామున‌, అర్ధ‌రాత్రి బెనిఫిట్ షోలు ప‌డేవి. కానీ పుష్ప‌-2 సినిమా ముందు రోజు రాత్రి అన్ని చోట్లా సెకండ్ షోతో ప్రిమియ‌ర్స్ ప‌డ్డాయి. ఆ త‌ర్వాత చాలా వ‌ర‌కు పెద్ద సినిమాల‌కు ఇదే ప‌ద్ధ‌తిని అనుస‌రించారు. ఐతే సంక్రాంతి సినిమాల త‌ర్వాత ఆ ట్రెండ్‌కు బ్రేక్ ప‌డింది.

గ‌త నాలుగు నెల‌ల్లో విడుద‌లైన ఏకైక పెద్ద సినిమా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మాత్ర‌మే కాగా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు ముందు రోజు పెయిడ్ ప్రిమియ‌ర్స్ వేయ‌లేదు. ఏపీలో రిలీజ్ రోజు తెల్ల‌వారుజామున 4-5 గంట‌ల మ‌ధ్య‌.. తెలంగాణ‌లో ఉద‌యం 7 గంట‌ల నుంచి షోలు మొద‌లుపెట్టారు. ఐతే తెలుగు నుంచి రాబోయే త‌ర్వాతి పెద్ద సినిమా పెద్దికి మాత్రం మ‌ళ్లీ పాత రూట్లో వెళ్ల‌బోతున్నారు నిర్మాత‌లు.

పెద్దికి జూన్ 4న రిలీజ్ కానుండ‌గా.. ముందు రోజే పెయిడ్ ప్రిమియ‌ర్స్ వేయ‌బోతున్నారు. ఆ షోలు తెలుగు రాష్ట్రాల‌కు ప‌రిమితం కావ‌డం లేదు. మొత్తం దేశ‌వ్యాప్తంగా ప్రిమియ‌ర్స్ ఉంటాయ‌ని మేక‌ర్స్ క‌న్ఫ‌మ్ చేశారు. ఐతే దురంధ‌ర్ సినిమా త‌ర‌హాలో సాయంత్రం నుంచే షోలు మొద‌లుపెట్టే ఆలోచ‌న నిర్మాత‌ల‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

దురంధ‌ర్ సినిమాకు చాలా ముందుగానే ప్రిమియ‌ర్స్ అనౌన్స్ చేశారు. ప‌ది రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొద‌లుపెట్టాడు. నార్మ‌ల్ రేట్ల‌తో ఈ ప్రిమియ‌ర్స్ వేయ‌డంతో అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. పెద్ది సినిమాకు ఎలాగూ తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల రెగ్యుల‌ర్ రేట్ల‌కే షోలు ప‌డ‌తాయి.

తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. ఏపీ వ‌ర‌కు రేట్లు పెర‌గ‌డం ఖాయం. తెలంగాణ సంగ‌తే తేలాల్సి ఉంది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రేట్ల పెంపుకోసం ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు నిర్మాత‌లు. పెద్దికి కూడా అలాగే చేస్తారా.. పెంపు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తారా అన్న‌ది చూడాలి.

రేట్లు పెరిగినా, పెర‌గ‌క‌పోయినా ముందు రోజు సాయంత్రానికి పెద్ది షోలు ప‌డిపోవ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. దురంధ‌ర్ త‌ర‌హాలోనే చాలా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌లయ్యే అవ‌కాశ‌ముంది.