మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ బడ్జెట్ మూవీ కెడి ది డెవిల్ కూడా ఉంది. జన నాయకుడు, టాక్సిక్, మెగాస్టార్ 158 నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ కావడంతో పాటుట్రైలర్ లో చూపించిన కంటెంట్ ఒక వర్గం మాస్ ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. అయితే సెన్సార్ తదితర కారణాల వల్ల తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ వెర్షన్లు ఆలస్యమయ్యాయి. కన్నడలో ఏప్రిల్ 30 విడుదల చేశారు.
ఇక టాక్ విషయానికి వస్తే కెజిఎఫ్ రేంజ్ లో ఊహించుకున్న ధృవ సర్జ అభిమానులకు అంత సీన్ లేదని అర్థమైపోయింది. ఇదో రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామా. 1970 ప్రాంతంలో కిరోసిన్ అమ్ముకుంటూ మాములు జీవితం గడిపే కాళీ అనే యువకుడు లోకల్ డాన్ దేవాతో శత్రుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇష్టపడిన అమ్మాయి, ప్రాణంగా చూసుకునే అన్నయ్య కోసం నేర ప్రపంచంలోకి అడుగు పెట్టి డెవిల్ గా మారతాడు. ఆ తర్వాత జరిగేది సులభంగా ఊహించుకోవచ్చు.
కోట్ల రూపాయల బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చు పెట్టిన దర్శకుడు ప్రేమ్ స్టోరీ పరంగా చాలా రొటీన్ లైన్ తీసుకున్నాడు. సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవిచంద్రన్ లాంటి అద్భుతమైన క్యాస్టింగ్ పెట్టుకుని కొన్ని వందలసార్లు అరిగిపోయిన లైన్ తీసుకోవడం విచిత్రమే. పైగా ఈగ విలన్ కిచ్చ సుదీప్ క్యామియో కూడా ఏమంత మేజిక్ చేయలేకపోయింది. వీకెండ్ కాబట్టి ఏదో లాగుతోంది కానీ సోమవారం నుంచి దీనికి కఠిన పరీక్ష తప్పదని బెంగళూరు మీడియా టాక్.
తెలుగు వెర్షన్ కు సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ మే 8 విడుదల చేయాలనుకుంటే ఇప్పటి నుంచి కనీస స్థాయిలో ప్రచారం చేయాలి. సినిమా ఎలా ఉందనేది పక్కనపెడితే ఇలాంటివి ఇష్టపడే జనాలకు కనెక్ట్ అయితే అంతో ఇంతో డబ్బులు రావొచ్చు. ధృవ సర్జ గతంలో పొగరు, మార్టిన్, సీత పయనంతో మన తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు. కానీ అవన్నీ డిజాస్టర్లే, పోనీ కెడి ది డెవిల్ ఏమైనా మార్పు తెస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates